Sep 29,2022 21:54

- కోల్డ్‌ స్టోరేజ్‌లను వినియోగించుకునేలా ఒత్తిడి
- అదానీకి కొమ్ముకాస్తున్న జమ్ముకాశ్మీర్‌ యంత్రాంగం
- అర్థంలేని ఆంక్షలతో అవాంఛనీయ ట్రాఫిక్‌జామ్‌
- పాడైపోయిన లక్ష టన్నుల ఆపిల్‌
- రైతులను ఆదుకోవాలని ఎఎఫ్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కాశ్మీర్‌ ఆపిల్‌ పండ్లపై అదానీ కన్నుపడింది. ఇప్పటికే కాశ్మీర్‌ ఆపిల్‌ మార్కెట్‌పై పెత్తనం చలాయిస్తున్న అదానీ కంపెనీ మరింత పట్టు బిగించేందుకు జమ్ముకాశ్మీర్‌ అధికార యంత్రాంగంతో కలిసి కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా దేశంలోని వివిధ మార్కెట్లకు ఆపిల్‌ సరఫరా తరలిస్తున్న దాదాపు 5 వేల ట్రక్కులు శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకున్నాయి. దీంతో దాదాపు లక్ష టన్నుల ఆపిల్‌ పంట పాడైపోయింది. అయితే ఈ ట్రాఫిక్‌ జామ్‌ జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగపు ఉద్దేశ్యపూర్వక చర్యలే వల్లే చోటుచేసుకున్నట్లు ఆపిల్‌ రైతులు విమర్శిస్తున్నారు. అదానీ లాంటి బడా కార్పొరేట్‌ కంపెనీలు నిర్మించి, నిర్వహిస్తున్న కోల్డ్‌ స్టోరేజీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే ఈ ఎత్తుగడల సారాంశమని వారు వాపోతున్నారు.
లెఫ్టినెంట్‌ గవర్నరుకు ఎఎఫ్‌ఎఫ్‌ఐ లేఖ
ఇదే విషయంపై ఆపిల్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఎఫ్‌ఎఫ్‌ఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాశ్మీర్‌ లోయలో ఉన్న ఆపిల్‌ రైతులకు భారీ నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు ఎఎఫ్‌ఎఫ్‌ఐ లేఖ రాసింది. గత అనేక వారాలుగా ఆపిల్స్‌ను ప్రధాన మార్కెట్లకు తీసుకువెళ్లే ట్రక్కులు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. అనంతనాగ్‌లోని మీర్‌బజార్‌ నుంచి బనిహాల్‌ టన్నెల్‌ వరకు 40 కిలోమీటర్ల విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై సగటున 20 టన్నుల ఆపిల్స్‌ను తీసుకువెళుతున్న 5,000 కంటే ఎక్కువ ట్రక్కులు ఎక్కడికక్కడే ఆగిపోయివున్నాయి. అధికార యంత్రాగం దురుద్దేశ్యపూర్వకంగానే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించే చర్యలకు పూనుకోవడం లేదని ఎఫ్‌ఎఫ్‌ఐ తెలిపింది. దీంతో లోయలోని ఆపిల్‌ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. దీనివల్ల రైతులతో పాటు చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతారని పేర్కొంది.
ఎఎఫ్‌ఎఫ్‌ఐ జమ్మూకాశ్మీర్‌ నేత అబ్దుల్‌ రషీద్‌ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్‌ నుంచి 5,000 ట్రక్కుల్లో ఒక్కొక్కటి 20 కిలోల ఆపిల్స్‌తో కూడిన 1,200 పెట్టెలను తీసుకువెళతాయని చెప్పారు. అంటే ఒక్కో ట్రక్కులో దాదాపు 20 టన్నుల ఆపిల్‌ ఉంటుందని, హైవే నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాయని పేర్కొన్నారు. ఫిర్యాదు తరువాత సీనియర్‌ పోలీసు అధికారిని బదిలీ చేస్తామని పరిపాలన విభాగం రైతులకు చెప్పినప్పటికీ, వారు ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదని అన్నారు. 'అన్ని ట్రక్కులు మార్కెట్‌లోకి ఒకేసారి చేరుకుంటే ఆపిల్‌ ధర తగ్గుతుంది. ఇప్పుడు ఆపిల్‌ కాశ్మీర్‌లోని మార్కెట్‌ల్లో, ట్రక్కుల్లో, పండ్ల తోటల్లో పాడైపోతుంది' అని అన్నారు. గత కొన్ని రోజులుగా సోపోర్‌ ఆపిల్‌ మార్కెట్‌ సుమారు రూ.500 కోట్ల నష్టాన్ని నమోదు చేసిందని తెలిపారు. 'ఫలితంగా, రైతులు ఆపిల్‌ బాక్స్‌పై కనీసం రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. రవాణా చేసేవారు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల కుటుంబాలు ఆపిల్‌పై ఆధారపడి ఉన్నాయి. రద్దీ కారణంగా లోయ మార్కెట్‌లకు ట్రక్కులు చేరుకోలేకపోతున్నాయి. మేము మనోజ్‌ సిన్హాను కలిశాము. చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇంకా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించలేదు' అని ఆయన అన్నారు.
కిలోకు కనీసం రూ.60 వచ్చేలా చూడాలి..
ఆపిల్‌ రైతులను ఆదుకోవాలని, కిలో ఆపిల్‌కు కనీసం రూ.60 వచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎఎఫ్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం నేతలు సోహన్‌ సింగ్‌ ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), అబ్దుల్‌ రషీద్‌ (జమ్మూకాశ్మీర్‌) ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పండ్ల మార్కెట్లలో కృత్రిమ కొరతను సృష్టించేందుకు, వినియోగదారుల మార్కెట్‌లో ధరలు పెరగడానికి కుట్ర జరిగిందని విమర్శించింది. పంట పండే కాలంలో సేకరణ ధరను తగ్గించి విపరీతమైన లాభాలను పొందేందుకు యోచిస్తోన్న పెద్దపెద్ద అగ్రీ బిజినెస్‌ కార్పొరేట్‌ సంస్థల విధానాలకు అనుకూలంగా కాశ్మీర్‌ పరిపాలన విభాగం సులభతరం చేస్తోందని పేర్కొంది. తద్వారా ఆయా కంపెనీలు ఆపిల్‌ రైతులను దోచుకోవడంతో విపరీతమైన లాభాలను పొందుతాయని దుయ్యబట్టింది. కాశ్మీర్‌ పరిపాలన విభాగం రైతు వ్యతిరేక వైఖరిని తీవ్రంగా ఎఎఫ్‌ఎఫ్‌ఐ నిరసించింది.
అదానీ, రిలయన్స్‌ మొదలైన వాటి యాజమాన్యంలోని పెద్ద అగ్రి బిజినెస్‌ సంస్థలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిన్నాయని, కిలో ఆపిల్‌ ధర రూ.300, అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాయని పేర్కొంది. ఆపిల్‌ రైతులకు కిలోకు రూ.30, అంతకంటే తక్కువ ఇస్తున్నారని తెలిపింది. ఈ విధంగా రైతులు భారీ నష్టాలను చవిచూడగా, అనూహ్యమైన ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆయా సంస్థలు దోచుకుంటున్నాయని పేర్కొంది. మరోసారి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆధ్వర్యంలోని జమ్మూకాశ్మీర్‌ పరిపాలన విభాగం, అగ్రి బిజినెస్‌ కార్పొరేట్‌ సంస్థలతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వం నియంత్రించే కార్పొరేట్‌ అనుకూల స్వభావం బహిర్గతమైందని విమర్శించింది. కాశ్మీర్‌ లోయలోని పండ్ల మండీల్లో జరుగుతున్న ఆందోళనలకు ఎఎఫ్‌ఎఫ్‌ఐ సంఘీభావం ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో యాపిల్‌ రైతుల పోరాటంలో ఎఎఫ్‌ఎఫ్‌ఐ చురుగ్గా పాల్గందని తెలిపింది. ఆపిల్‌ ట్రక్కుల తరలింపునకు ఉన్న అన్ని అడ్డంకులనూ తక్షణమే తొలగించాలని, వాటి వల్ల ఏర్పడిన నష్టాలను రైతులకు భర్తీ చేయాలని జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగాన్ని కోరింది. మోడీ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, కృత్రిమ కొరత సృష్టించి, యాపిల్‌ ధరలను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.