Nov 26,2022 13:13

ప్రజాశక్తి-వింజమూరు (నెల్లూరు జిల్లా) : వింజమూరు పట్టణంలో భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ శనివారం ముచ్చటగా మూడోసారి ప్రారంభమైన మండల సర్వసభ్య సమావేశంలో కోరంఫామ్‌ లేదని ఇంచార్జ్‌ ఎంపీడీవో ప్రసన్న కుమారి సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యులంతా తాము ఇక్కడే ఉన్నాము లేకపోవడం ఏమిటి ? వాయిదా ఎలా వేస్తారు ? అని ప్రశ్నించగా, ముందు వారంతా రిజిస్టర్‌లో సంతకాలు పెడితే కోరంఫామ్‌ అవుతుందని, లేకపోతే సభ వాయిదా పడుతుందని ఆమె స్పష్టం చేశారు. సభాధ్యక్షులు లేకుండా సభను ఎలా నిర్వహిస్తారని వచ్చిన ఎంపీటీసీలు ఇంచార్జ్‌ను అడగగా వారంతా సంతకాలు పెడితే ఆయన వస్తారు అని సందేశం ఇచ్చారు. 11 మంది సభ్యులు హాజరైనప్పటికీ కోరంఫామ్‌ లేకపోవడంతో సభను వాయిదా వేశారు. కనీసం వైస్‌ ఎంపీపీ గా ఉన్నవారితోనైనా సభను నిర్వహిస్తే సంతకాలు చేస్తామని ఎంపీటీసీ సభ్యులు ఎంపిడిఓ కు తెలియజేశారు. ఇదిలా ఉండగా సభలో ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ ... తమ హక్కులను కాలరాస్తున్నారని, తాము ఎవరు కింద బానిసలం కాదు అని ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులం అని, తమపై కక్షగట్టి రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు అధికారులు పనిచేయడం ఎంతవరకు సబబు అని గట్టిగా నిలదీశారు. ఎవరో బయటి వ్యక్తుల పెత్తనం మేరకు ఎంపీడీవో కార్యాలయం పనిచేస్తుందని స్వయానా తాము ఎంపీటీసీలుగా చిన్న సమాచారం కూడా తీసుకోలేకపోతున్నామని అలాంటప్పుడు తమకు ఎందుకు ఈ పదవులని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళితులను, గిరిజనులను, బీసీ నాయకులను బెదిరించి పోలీసులను వాడుకొని గుట్కా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సభలో వాపోయారు. ఎంపీటీసీ సభ్యులకు నోటీసులిచ్చి బెదిరించి సభకు తీసుకురావడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారులు ఎందుకు బెదిరిస్తున్నారని వారు సభలో నిలదీశారు. చీకటి ఒప్పందాలు చేసుకోవడం ఫోన్లో ఎంపీటీసీలను బెదిరించడం ఎంతవరకు సమంజసమని వారు కొత్తగా వచ్చిన ఇంచార్జ్‌ ఎంపీడీవో అని అడిగారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీటీసీ ఆనింగ్‌ రమణయ్య, ఎంపిటిసిలు పల్లాల కొండారెడ్డి, వనిపెంట హైమావతి, సాధ మౌనిక, ఏకశిరి భవాని, ఉంటా రత్తమ్మ, గవ్వల మల్లికార్జున, బసిరెడ్డి సుమలత, డేగ వంశీ, తదితరులు పాల్గొన్నారు.