
ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్/ప్రొద్దుటూరు పుట్టపర్తిసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా నిరాధారణకు గురైన చేనేతను దత్తత తీసుకుంటానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర బుధవారం 112వ రోజుకు చేరుకుంది. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి విడిది కేంద్రం నుంచి దేవగుడి గ్రాస్ మీదుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చౌడూరులోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి శంకరాపురం, పెద్దశెట్టిపల్లె, నరసింహాపురం, చౌటపల్లి విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో పద్మశాలి సామాజిక తరగతివారు, స్థానికులు, రైతులు, ఎంఆర్‌పిఎస్ నాయకులతో లోకేస్ ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల లోకేష్ మాట్లాడుతూ తల్లి, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసిన జగన్... తల్లి లాంటి కడప జిల్లాకూ అన్యాయం చేశారని విమర్శించారు. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసే తీరిక జగన్‌కు లేదని దుయ్యబట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఉన్న 5 శాతం జిఎస్‌టి భారం పడకుండా చేస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రన్న భీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ అందజేస్తామన్నారు. చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు నష్టపోకుండా కల్తీ విత్తనాలు, పురుగుమందుల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, టిడిపి కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు భూపేష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.