
మట్టి పాత్రల్లో వంట చేసే సంప్రదాయం భారత ప్రజలకు కొత్తేమీ కాదు. సాంకేతిక పురోగతితో ప్రజలు క్రమంగా స్టెయిన్లెస్ స్టీల్ యుగం వైపు వెళ్లడంతో మట్టి ఉత్పత్తులు క్రమంగా ప్రజల జీవితాల నుంచి కనుమరుగయ్యాయి. వినూత్న ఉత్పత్తులతో దానిని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దృఢ సంకల్పంగా కృషి చేస్తున్నారు మన్సుఖ్ భాయ్ ప్రజాపతి. రిఫ్రిజిరేటర్లు, ఫిల్టర్లు, తవా, కుక్కర్ల వంటి అధునాతన పాత్రలను మట్టితోనే తయారు చేసి, ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
గుజరాత్‌కు చెందిన ప్రజాపతి కుటుంబం సాంప్రదాయ వృత్తి కుండలు చేయడం. 'మా పెద్దలు రోజంతా పనిచేసేవారు. ఈ పని వల్ల ఏర్పడే కాలుష్యం కుమ్మరుల్లో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పొగ, ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. మా తాత, అతని సోదరులు 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించలేదు. ఈ వృత్తిలో సంభవించే అనారోగ్య కారణాల వల్ల తమ కుమార్తెలను కుండలు చేసే వ్యక్తితో వివాహం చేయడానికి ఎవరూ సిద్ధపడేవారు కాదు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మా నాన్న నన్ను వృత్తికి దూరంగా ఉంచారు'' అని అంటున్నారు ప్రజాపతి.
వృత్తిపని చేయలేక అతడి తండ్రి తాపీపనికి వెళ్లేవారు. పదో తరగతి తర్వాత ప్రజాపతి కూడా తండ్రితో పాటు పనికి వెళ్లారు ప్రజాపతి. ఆ పనిపట్ల ఆసక్తి లేకపోవడంతో ఒక టీ స్టాల్లో పనికి కుదిరారు. సంవత్సరం తర్వాత పైకప్పు పలకల కర్మాగారంలో చేరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐదేళ్లలో దాదాపు 22 లక్షల పలకలను తయారు చేసారు. అప్పుడు మళ్లీ ప్రజాపతి తన కుటుంబ వృత్తిలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు.
వృత్తిలోకి వెళ్లడాన్ని వ్యతిరేకించిన తండ్రి, రుణ సహాయం చేసిన వడ్డీ వ్యాపారి నిరుత్సాహపరిచినప్పటికీ, ప్రజాపతి తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించారు. '1988లో నేను సాంప్రదాయ కుమ్మరి చక్రానికి బదులుగా టైల్ ప్రెస్‌ని ఉపయోగించి మొదటి మట్టి ఉత్పత్తి తవా (పాన్) తయారు చేసాను. సాంప్రదాయ చట్రంపై కుమ్మరులు రోజుకు వంద తవాలను తయారు చేస్తే, నేను 3,500-4,000 చేసేవాడిని. ఇప్పుడు చాలామంది కుమ్మరులు తవా చేయడానికి నా యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు' అని వివరించారు.
అతని మొదటి ఉత్పత్తి విజయవంతం కావడంతో రెండో దానిపై దృష్టి పెట్టారు. ఆయన నివసించే గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం బావులు, నదులపై ఆధారపడేవారు. ఆ నీటిని వస్త్రంతో ఫిల్టర్ చేసేవారు. దానికోసం తాగునీటి నుండి మలినాలను ఫిల్టర్ చేసే క్లే వాటర్ ఫిల్టర్‌ను సృష్టించారు. అయితే ప్రజాపతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది మాత్రం మట్టి రిఫ్రిజిరేటర్. ఒక దురదృష్టకర ఘటన నుండి ఈ ఆలోచన వచ్చిందంటున్నారు. 2001లో గుజరాత్లో భూకంపం సంభవించినప్పుడు ఆయన మట్టి ఉత్పత్తులు నాశనమయ్యాయి. ఒక స్థానిక వార్తాపత్రిక 'గరీబోన్కా ఫ్రిజ్ టూట్ గయా' శీర్షికతో విరిగిన మట్టి కుండ చిత్రాన్ని ప్రచురించింది. ఆ వార్త విద్యుత్తు లేకుండా పనిచేయగల మట్టి రిఫ్రిజిరేటర్‌ను రూపొందించడానికి ప్రజాపతికి ప్రేరణనిచ్చింది. 19 లక్షల రుణం తీసుకుని ఐదేళ్లు కష్టపడి మట్టి రిఫ్రిజిరేటర్‌ను రూపొందించారు. ఇది నీటిని మాత్రమే ఉపయోగించే సహజ పర్యావరణ అనుకూల ఫ్రిజ్ అంటారాయన.
రిఫ్రిజిరేటర్ రూపకల్పనలో ఐఐఎమ్, అహ్మదాబాద్ ప్రొఫెసర్ అనిల్‌గుప్తా, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, హనీబీ నెట్వర్క్ నుండి సహాయాన్ని అందుకున్నారు. ''నా ఫ్రిజ్‌ని అనిల్ గుప్తాకు చూపించగానే, వంద ఫ్రిజ్‌ల కోసం లక్షా 80 వేల రూపాయలు ఇచ్చారు. ఆయన సహాయంతో పేటెంట్ పొందాను. ప్రధాని మోదీ నా రిఫ్రిజిరేటర్‌ను ప్రారంభించారు. నా ఫిల్టర్ నుండి నీరు తాగిన మొదటి వ్యక్తి మోడీకి క్లే కుక్కర్‌ను అందించాను. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభాపాటిల్, ఎపిజె అబ్దుల్ కలాం నన్ను ఎంతో ప్రశంసించారు.'' అని చెప్తున్నారు ప్రజాపతి.
క్లే రిఫ్రిజిరేటర్‌తో విజయాన్ని అందుకున్న మన్సుఖ్ భాయ్ 'మిట్టీకూల్' పేరుతో కంపెనీ ప్రారంభించారు. ఇప్పటివరకు 250 వేర్వేరు మట్టి ఉత్పత్తులను సృష్టించారు. ఏసీ, కూలర్, ఫ్యాన్ లేకపోయినా కూల్‌గా ఉండే మట్టి ఇంటి ఆవిష్కరణతో ఉన్నారు. ''ప్రతి ఒక్కరూ ఎయిర్ కండీషనర్ కొనలేరు. మండే వేసవిలో ఫ్యాన్లు, కూలర్లు సరిపోవు. అందుకే ఇంటి ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించి, చల్లగా ఉంచే ప్రత్యేక రకమైన మట్టి ఇటుకలతో వస్తున్నాను'' అంటారు.
మట్టి ఉత్పత్తులను ఉపయోగించడం పర్యావరణానికీ, మనిషి ఆరోగ్యానికీ చాలా ఉపయోగం. ''మట్టి పాత్రలు పారగమ్యత వల్ల వంట ప్రక్రియలో వేడి, తేమ సమానంగా ప్రసరిస్తాయి. ఈ పద్ధతిలో తయారుచేసిన భోజనం ఇతర పాత్రల్లో తయారుచేసిన ఆహారం కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. తక్కువ నూనె అవసరమవుతుంది. మట్టి కుండల్లో వండిన ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బంకమట్టి ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది, శరీరానికి పిహెచ్ సమతుల్యతను అందిస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను అధిగమిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది'' అంటున్నారు ఆహార నిపుణులు.