
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్లో నిర్వహించిన ఆందోళనలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఎఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎ, ఆర్వైఎఫ్, పిఎస్యు, ఎఐవైఎల్, ఎఐఎస్బి, ఎఐడివైఒ, ఎఐడిఎస్ఒ, ఆర్వైఎ సహా పలు విద్యార్థి, యువజన సంఘాల యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపి, డివైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం దేశ యువతకు పెనుముప్పును తెచ్చి పెడుతుందని విమర్శిం చారు. సాయుధ దళాల్లో ప్రధాన భాగాన్ని కాంట్రాక్టీకరణ చేయడమే అగ్నిపథ్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించు కోవడమే కాకుండా సాయుధ దళాల్లో పెండింగ్లో ఉన్న ఖాళీలను అత్యవసర ప్రాతిపదికన రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని యువతకు శాశ్వతమైన, గౌరవంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వాలన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, యువతకు ఉపాధి కోసం డివైఎఫ్ఐ పోరాటాలు కొనసాగుతా యన్నారు. అగ్నిపథ్కి వ్యతిరేకంగా దేశమంతటా ఐక్య ఉద్యమం సాగాలని సూచించారు. డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమగరాజ్ భట్టాచార్య మాట్లాడు తూ 2014లో అధికారంలోకి రాకముందు బిజెపి, నరేంద్ర మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. బిజెపి హయాంలో 45 ఏళ్లలో గరిష్టంగా నిరుద్యోగ రేటు నమోదు అయిందని దుయ్యబట్టారు. దేశంలోని యువత ఉపాధి కలను ఒక్కసారిగా నాశనం చేసే, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. వినాశకరమైన అగ్నిపథ్ పథకానికి, దేశంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ఐక్య ఉద్యమాలనుకొనసాగించాలని పిలుపునిచ్చారు.