Feb 01,2023 00:30

- ద్రవ్యోల్బణం అనివార్యం
- ప్రజలకు ధరల పోటు
-మానిటైజేషన్‌ దూకుడు
- కార్పొరేట్ల చేతుల్లోకి ద్రవ్య వ్యవస్థ
-ఆర్థిక సర్వే నిర్దేశం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి :భారత ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రభావం చూపిస్తోందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థ స్థాయికి దేశం దూసుకుపోతుందని ఒక వైపు ఊదరగొడుతూనే మరో వైపు మాంద్యంతో వచ్చే సంవత్సరం వృద్ధి మందగిస్తుందని హెచ్చరించింది. ప్రజలకు ధరల మంట తప్పదని పేర్కొంది. అంతర్జాతీయంగా రూపాయి మారకం విలువ పడిపోతుందని, కరెంట్‌ ఖాతా లోటు ఎక్కువవుతుందని తెలిపింది. గడచిన కొన్నేళ్లకు మాదిరిగానే కార్పొరేట్లకు మేలు చేసే చర్యలను ఏకరువు పెట్టింది. ప్రైవేటీకరణ జపం చేసింది. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లక్ష్యాలు సాధించామని, వచ్చే ఏడాది మరిన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని సలహా ఇచ్చింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభంకాగా, 2022-23 సంవత్సరానికి ఆర్థిక సర్వేని విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఆర్థిక సర్వేని రూపొందించారు.
వృద్ధి కిందికి
ప్రస్తుత ఏడాదిలో జాతీయ స్థూలోత్పత్తి (జిడిపి) వృద్ధిని 7 శాతంగా అంచనా వేసిన ఆర్థిక సర్వే వచ్చే ఏడాది 6.5 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ప్రపంచంలో నెలకొన్న మాంద్యం పరిస్థితుల వలన వృద్ధి మందగిస్తుంది. కోవిడ్‌ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు కాస్తంత పుంజుకున్నాయి. అన్ని రంగాల్లో వృద్ధి కొనసాగుతోంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం 7.8 శాతం వద్ద ఏడాదంతా స్థిరంగా కొనసాగింది. ఆర్‌బిఐ విధించిన పరిమితి 6 శాతం కంటే చాలా ఎక్కువ. రానున్న సంవత్సరంలోనూ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉండొచ్చు. కాగా ద్రవ్యోల్బోణం పెరుగుదల ఆర్థిక పరిస్థితి అదుపునకు సాధ్యమైందని సర్వే అభిప్రాయపడింది. అయితే ద్రవ్యల్బోణం, అందులోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైందన్న విషయాన్ని ఆర్థిక సర్వేలో నర్మగర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక ఒడుదుడుకులు, ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు వలన మన రూపాయి విలువ పతనం అవుతుంది. ఆ ఫలితంగా కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతుంది. ఎగుమతులు మందగించే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఆస్తుల అమ్మకం
ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు అమ్మేందుకు ఉద్దేశించిన మానిటైజేషన్‌కు ఆర్థిక సర్వే జైకొట్టింది. ఈఏడాది రూ.80 వేల కోట్ల విలువైన ఆస్తులను అమ్మాలన్నది టార్గెట్‌ కాగా అంతకంటే ఎక్కువ రూ.90 వేల కోట్ల ఆస్తులు అమ్మడానికి నిర్ణయించారు. ఇదే ఊపులో వచ్చే ఏడాది మానిటైజేషన్‌ లక్ష్యం రూ.1.6 లక్షల కోట్లు పెట్టుకోవాలని ఆర్థిక సర్వే నిర్దేశించింది. నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ ద్వారా రూ.141 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇవ్వాలి. 'ఉడాన్‌' పథకంలో కోటి మంది విమాన ప్రయాణీకులకు సౌకర్యం లభించింది. డిజిటల్‌ ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం 200 శాతం పెరిగింది. దేశంలో 117.8 కోట్ల టెలిఫోన్‌ వినియోగదారులుండగా వారిలో 44.3 శాతం గ్రామీణ వాసులు. టెలిఫోన్లలో 98 శాతం వైర్‌లెస్‌.
గోళ్లూడగొట్టి పన్నులు
పన్నులు బాదడం వలన ప్రభుత్వ ఆదాయంలో 15.5 శాతం వృద్ధి కనిపిస్తోంది. జిఎస్‌టి వసూళ్లు ఏకంగా 24.8 శాతం పెరిగాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు డిబిటి (నగదు బదిలీ) విస్తరణ జరిగింది. దేశంలో నిరుద్యోగిత పెరుగుదల రేటు తగ్గినట్లు ఆర్థిక సర్వే వండి వార్చింది. 2018-19లో నిరుద్యోగిత 5.8 శాతం కాగా 2022-23లో 4.2 శాతానికి తగ్గిందని తెలిపింది.
వ్యవసాయంలో ప్రైవేటు కేపిటల్‌
వ్యవసాయరంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతం పెరిగాయి. రైతులకు ఒకటిన్నర రెట్ల ఎంఎస్‌పి ఇచ్చేసినట్లు ఆర్థిక సర్వే మరోసారి అసత్యాలు పలికింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపింది. పారిశ్రామిక వృద్ధి కొనసాగుతోందని, నిర్మాణరంగం పట్టాలకెక్కడంతో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని, వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి తోడ్పడుతున్నాయని, ఫార్మారంగంలోకి నాలుగు రెట్ల ఎఫ్‌డిఐలు వచ్చాయని, సర్వీసు రంగం కోలుకుంటోందని తెలిపింది. ఆహారభద్రత సహా సమాజిక సర్వీసుల్లో ప్రభుత్వ ఖర్చు కొనసాగిందని, ఆరోగ్యరంగంలో ప్రభుత్వ ఖర్చు జిడిపిలో 2.2 శాతానికి చేరుకుందని ఆర్థిక సర్వే వివరించింది.