Nov 28,2022 12:35

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : డిసెంబర్‌ 9, 10 వ తేదీలలో జరిగే ఐద్వా వజ్రోత్సవ సభలను జయప్రదం చేయాలని ఐద్వా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు కె.పద్మజ పిలుపునిచ్చారు. సోమవారం పొలమురు రహదారిపై హైస్కూల్‌ బాలికలతో హింస వ్యతిరేక ర్యాలీ , మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ ... దేశంలో 2020 లో 3 లక్షల 71 వేల 503 కేసులు నమోదు కాగా, 2012 లో 4 లక్షల 28 వేల 278 కేసులు నమోదయ్యాయన్నారు. రోజుకు సగటున 86 అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. సగటున గంటకు 49 నేరాలు మహిళలపై జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 77 నిమిషాలకు ఒక వరకట్నపు హత్య జరుగుతుందని తెలిపారు. ప్రతి 48 నిమిషాలకు ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె జయశ్రీ , కె ధనలక్ష్మీ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు డి.శకుంతల, జి.సుబ్బలక్ష్మి , ఎంపీటీసీ 1 ఎం.నాగదుర్గ, విద్యార్థులు పాల్గొన్నారు.