Nov 29,2022 22:02

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింస, దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐద్వా కోరింది. ఈ మేరకు మహిళా కమిషన్‌కు ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి మంగళవారం లేఖ రాశారు. కుటుంబ హింసకు సంబంధించి కేసు ఐపిసి 498ఏను నీరు గార్చారని తెలిపారు. రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన కేసులు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని, సిబ్బంది కొరతతో మహిళలకు న్యాయం జరగడం లేదని వివరించారు. గృహ హింస నిరోధక కేంద్రంలో ఐదుగురు, సఖి కేంద్రంలో 19 మంది ఉండాల్సి ఉండగా ఎక్కువ చోట్ల ముగ్గురు, నలుగురు సిబ్బంది ఉన్నారని, దీంతో కేంద్రాలు కునారిల్లుతున్నాయని తెలిపారు. ఉన్నవారికీ సక్రమంగా జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. ఫోక్సో కేసుల్లో ప్రత్యేక కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారని, ఇంతవరకు ఒక్క జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్రంలోనూ ఇటీవల పసిపిల్లల మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగాయని పేర్కొన్నారు. హాస్టళ్లలో, ఆశ్రమ పాఠశాలల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, విచారణ జరిగేలోపు నిందితులు బెయిల్‌పై విడుదల అవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం బాధితులపై ఒత్తిడి చేస్తున్నారని, సామాజికంగానూ అవమానం ఎదుర్కొవాల్సి వస్తోందని ప్రకటించారు. విశాఖపట్నం చినముషిరివాడలో అత్యాచారానికి గురైన పాపకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని తెలిపారు. రాష్ట్రంలో వివరాలు సులభంగా సేకరించగల మహిళా కమిషన్‌ మహిళలకు, పిల్లలకు రక్షణ కల్పించేలా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. నవంబరు 25 నుండి డిసెంబర్‌ 10 వరకూ ఐక్యరాజ్యసమితి ప్రకటించిన హింసా వ్యతిరేక చర్యల్లో భాగంగా మహిళలు, పిల్లలపై దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐద్వా కోరింది.