Aug 21,2022 10:47

అవును ఆకుకూరలతో కూరలే వండుకోవడం సర్వసాధారణ విషయం.. పులుసుకూరలో.. పప్పులోనో.. ఫ్రై చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ ఆకుకూరలు పిల్లలు తినడానికి మారాం చేస్తుంటారు. పెద్దలు కూడా కొందరు ఆకుకూర అనగానే అయిష్టంగా ఉంటారు. అందరూ తినేలా.. ఆరోగ్యం పంచేలా.. ఆకుకూరలతో స్నాక్స్‌ చేసి పెడితే.. ఎవరైనా తినేస్తారు.. అయితే అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
వడలు..

vada


కావలసిన పదార్థాలు : ఆకుకూర - తోటకూర / ములగాకు / మెంతాకు / పొన్నగంటి / పాలకూర - రెండు కప్పులు (సన్నగా కట్‌ చేసినది), శనగపప్పు - కప్పు (నాలుగు గంటలు నానబెట్టినది), పచ్చి, ఎండు మిర్చి - రెండు చొప్పున, వెల్లుల్లి - 5, 6 (ఇష్టమైతేనే), అల్లం - అరంగుళం ముక్క. ఉల్లిపాయ - 1 (సన్నగా కట్‌ చేసుకోవాలి), ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ విధానం : నానిన శనగపప్పును, పచ్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్క వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో సన్నగా కట్‌ చేసిన ఆకుకూర, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. చివరిలో ఉప్పు వేయాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు చిలకరించండి. దాదాపు అవసరం ఉండకపోవచ్చు. స్టవ్‌పై పాన్‌ పెట్టి, నూనె పోయాలి. నూనె కాగాక, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా చేసుకుని, డీప్‌ ఫ్రై చేసుకోవాలి. అంతే ఆకుకూరల వడలు రెడీ.. టమాటా చిల్లీ సాస్‌తో తింటే వావ్‌ అంటారు.

క్రంచీ పకోడీ

pakodi


కావలసిన పదార్థాలు : ఆకుకూర - కొయ్యతోటకూర / తోటకూర / పాలకూర - రెండు చిన్న కట్టలు (సన్నగా కట్‌ చేసినది), శనగపిండి - 200 గ్రాములు. పచ్చిమిర్చి -నాలుగు, అల్లం - రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు - 10-15, ఉప్పు - తగినంత, బియ్యం పిండి - 1 స్పూన్‌, జీలకర్ర - స్పూన్‌, నూనె - సరిపడా.
తయారీ విధానం : ముందుగా మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి ఆకుకూర వేసి, బియ్యం, శనగపిండి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి బాగా కలపాలి. అక్కడక్కడా పొడిపిండి కనిపిస్తూనే ఉండాలి. దీన్ని చేతిలోకి తీసుకుని బాగా కాగిన నూనెలో గట్టిగా వేళ్ల మధ్యన నలుపుతుండాలి. అప్పుడు వేళ్ల మధ్యలో నుండి ఉండలు ఉండలుగా పిండి పడుతుంటుంది. కొంత పొడిగా కూడా అవుతుంది. నూనెలో వేసిన తర్వాత కొద్దిగా చల్లారుతుంది. అందుకే హై ఫ్లేమ్‌ మీద వేపుకోవాలి. నూనెలో వేశాక బుడగలు పోయే వరకూ జాగ్రత్తగా కలపాలి. ఆ తర్వాత చక్కగా బంగారువర్ణం వచ్చే వరకూ వేపుకోండి. ఈ మొత్తం పిండిని రెండు లేదా మూడుసార్లుగా వేసుకోండి. అంతేగానీ మొత్తం ఒకేసారి వేసుకోకండి. అలా వేస్తే క్రిస్సీగా పకోడి రాదు. పకోడీ తీశాక, రెండు చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు రెండు వేపి వీటితో నంజుకుని తినండి. ఆహా భలే ఉంటుంది. వీటిని పప్పు కూరలో కూడా నంజుకుని తినొచ్చు. వీటిని గాలి చొరని డబ్బాలో ఉంచితే, రెండురోజులు నిల్వ ఉంటాయండోరు.
సమోసాలు..

samosa


కావలసిన పదార్థాలు : ఆకుకూర - కోయతోటకూర / తోటకూర / ములగాకు / పొన్నగంటి / పాలకూర - కప్పు (సన్నగా కట్‌ చేసినది), గోధుమపిండి - కప్పు. నెయ్యి - తగినంత, నీళ్లు - తగినన్ని, వాము - కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- స్పూన్‌, ఉప్పు - తగినంత, జీలకర్ర, పసుపు- చిటికెడు, నూనె - సరిపడా.
తయారీ విధానం : ముందుగా బౌల్‌ తీసుకుని, అందులో గోధుమపిండి, ఉప్పు, కరగబెట్టిన నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ పిండిని చేతిలో ముద్ద చేస్తే గట్టిపడేలా ఉండాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి చెపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి, నూనె వేసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు వేసి, కట్‌ చేసుకున్న ఆకుకూర వేసుకుని మగ్గనివ్వాలి. ఇది పూర్తిగా మగ్గాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని, పూరీల్లా వత్తుకోవాలి. దీన్ని సరిగ్గా సగానికి కట్‌ చేసి, ఒక్కో సగాన్ని సమోసాలో చుట్టి, అందులో ఆకుకూర మిశ్రమాన్ని ఒక స్పూన్‌ ఉంచి క్లోజ్‌ చేయాలి. వీటిని నూనెలో డ్రీప్‌ ఫ్రై చేసుకోవాలి. వీటిల్లోకి అల్లం చట్నీ గానీ, టమాటా చిల్లీ సాస్‌గానీ మంచి కాంబినేషన్‌. పిల్లలు ఇష్టంగా తింటారు కూడా.
చపాతీలు..

chapathi


కావలసిన పదార్థాలు : ఆకుకూర - తోటకూర / ములగాకు / మెంతాకు / పొన్నగంటి / పాలకూర - కప్పు (సన్నగా కట్‌ చేసినది), గోధుమపిండి - కప్పు. పచ్చిమిర్చి - రెండు, అల్లం - అరంగుళం ముక్క, ఉప్పు, నీళ్లు - తగినంత, జీలకర్ర - చిటికెడు, నూనె - సరిపడా.
తయారీ విధానం : ముందుగా మిక్సీ జార్‌లో ఆకుకూర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, గోధుమపిండి వేసి చపాతీ పిండిలా బాగా కలపాలి. కొద్దిసేపు అలా వుంచి, తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని చపాతీలు చేసుకుని, పొయ్యి మీద పెనం పెట్టి, నూనె వేసి, చక్కగా కాల్చుకోవాలి.