Sep 22,2022 20:01

కోచి : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పోరు సల్పేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కోరారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల సిద్ధాంతాలతోపాటు ఆర్థిక, వ్యవస్థాగత అధికారాలపై పోరాడాలని కోరారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా కోచిలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ శక్తులపై పోరాడడం చాలా కీలకమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సంస్థాగత ఎన్నికల గురించి, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా రాహుల్‌ దాటవేశారు. అధ్యక్షుడిగా వుండే వ్యక్తికి తనదొక సలహా అంటూ 'చారిత్రకమైన పదవిని చేపడుతున్నప్పుడు దానికంటూ కచ్చితమైన సిద్ధాంతాలు, విశ్వాస వ్యవస్థ వుంటాయి. వాటిని పూర్తిగా నమ్మగలిగే, ఆచరించే వారు అందులో వుండాలని' సూచించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలెవరైనా ఆ పదవికి పోటీ పడవచ్చన్నారు. ఉదరుపూర్‌ చింతన్‌ శిబిర్‌లో 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అనే సిద్ధాంతానికి మద్దతు ఇచ్చామని, ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు. దీంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగాను కొనసాగుతానంటూ ఇటీవల గెహ్లాట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను అధ్యక్ష పీఠాన్ని చేపడితే.. తన ప్రత్యర్థి సచిన్‌ పైలెట్‌ సిఎం అవుతారని ఆయన భావిస్తున్నారు. రాహుల్‌ వ్యాఖ్యలతో.. అశోక్‌ గెహ్లాట్‌ అధ్యక్షుడైతే.. సిఎం పదవిని వదులుకోక తప్పదని స్పష్టమైంది. అదే జరిగితే స్పీకర్‌ సిపి జోషిని సిఎం చేయాలని గెహ్లాట్‌ సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది.
ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ
ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30 వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలన, 8 వరకూ ఉపసంహరణకు గడువు. అక్టోబర్‌ 17న పోలింగ్‌, 19న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఈ రేసులో రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్‌, కమల్‌నాధ్‌, మనీష్‌ తివారీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య పేర్లు వినిపిస్తున్నాయి.