
అమరావతి: భూమి, ఇసుక, మద్యం నుంచి గనుల వరకు వచ్చే ప్రతి పైసా జగన్ చేతిలోకే వెళుతుందని, ప్రజలంతా వైసిపి రాజ్యానికి బానిసలుగా అయిపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. వైసిపి పాలనపై తనదైన శైలిలో స్పందించారు. ''అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి.. కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య వంటి 'క్లాస్ వార్' గురించి మాట్లాడుతున్నారు. ఇదో విచిత్రం!. ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైసిపి రాజ్యానికి బానిసలుగా అయిపోయారు. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. నిజంగా ఇదో గొప్ప కళాఖండం.!
వైసిపి ఎపిలోని పేదలను సామాన్యతతో సంతఅప్తిగా ఉండేలా చేసింది. వారి జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని డబ్బులకు అమ్ముడుపోయాయి. ఎపిలో మిడిల్ క్లాస్‌పై అత్యంత నిర్లక్ష్యం. వారిని టాక్స్ పేయింగ్ మూగ సేవకులుగా వైసిపి పరిగణిస్తోంది. వైసిపి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం తీసుకురాగలిగినప్పుడు.. దావోస్ ఎవరికి కావాలి? మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చారు పాయింట్లను ప్రారంభించారు. ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు. ఇదో చిత్రమైన పరిణామం'' అని పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.