May 28,2023 10:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక జట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశంలో వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం నాడిక్కడ జరిగిన నీతి ఆయోగ్‌ ఎనిమిదో పాలకమండలి సమావేశంలో పాల్గొన్న సిఎం జగన్‌ నీతి ఆయోగ్‌ చర్చలో వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమర్పించారు. దేశంలో లాజిస్టిక్స్‌ ఖర్చు 14 శాతంగా ఉందని, దేశ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారుతుందని చెప్పారు. అమెరికాలో లాజిస్టిక్స్‌ ఖర్చు కేవలం 7.5 శాతమేనని, ఆశించిన ఫలితాలను సాధించడానికి సరకు రవాణా కారిడార్లు దేశవ్యాప్తంగా ఒకే ధరపై ప్రభుత్వం ఖర్చు చేయడం చాలా అవసరమని అన్నారు.
ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో కొత్తగా నాలుగు కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. కర్నూలులో ఓర్వకల్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పిపిపి పద్ధతిలో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దేశ జిడిపిలో తయారీ, రంగాల వాటా 85 శాతం దాటినప్పుడే 'వికసిత్‌ భారత్‌' లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. రెండు వేల ప్రపంచ సగటు వాటా 91.5 శాతమని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన రంగానికి సంబంధించి అత్యంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, వ్యాపారులకు అత్యంత అనుకూలమైన అనుమతులు సహా ఇతర విధానాలను సరళీకృతం చేశామని తెలిపారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం చాలా ముఖ్యమని అన్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, దీర్ఘకాలిక వ్యాధుల భారం గురించి తెలుసుకోవాలని అన్నారు. అందువల్ల హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని, ఇందులో ఒక మిడ్‌-లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఒక ఎన్‌ఎంను, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి విలేజ్‌, వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగస్టిక్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించామని, విలేజ్‌ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌ ఉండేలా చూసుకున్నామని అన్నారు. సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకమని, మహిళలకు ఆర్థిక వనరులు, అవకాశాలను పెంపొందించడానికి, ఏపి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.