Sep 23,2022 08:00

ఈ వారంలోనే ప్రభుత్వ ప్రకటన?
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాజధాని ప్రాంతం అమరావతి మున్సిపాలిటీగా మారనుంది. గ్రామసభలు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకునే ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వం అనంతర చర్యలవైపు దృష్టి సారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వారంలోనే అమరావతిని మున్సిపాల్టీగా ఏర్పాటు చేస్తూ ఈ వారంలోనే ప్రభుత ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనను అన్ని గ్రామాల్లోనూ ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకించడంతో గ్రామసభల అనుమతి లేకుండానే అధికారుల అభిప్రాయంతో అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటూ సిఆర్‌డిఎ చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపాల్టీ ప్రకటనకు అడ్డంకులు తొలిగిపోయాయన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే దీంతో దేశంలో అత్యధిక భూబ్యాంకున్న పట్టణంగా అమరావతి మున్సిపాలిటీ నిలవనుంది. గతంలో కార్పొరేషన్‌గా మార్చినా దానికి తగినంత మంది ప్రజల నివాసం లేకపోవడంతో మున్సిపాలిటీ స్థాయిగానే దీన్ని పరిగణించనున్నారు. ఇంతకు ముందే అమరావతి పరిధిలో గ్రామాలన్నిటినీ పురపాలన శాఖ కిందకు తీసుకొచ్చినా పంచాయతీలుగానే ఉన్నాయి. ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీగా మార్చి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకునే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. స్థానికసంస్థ ఏర్పాటైతే అనుకున్న విధంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ వినియోగ మార్పిడి, కేటాయింపులన్నీ స్థానిక సంస్థ నిర్ణయాల ఆధారంగా జరుపుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీగా ఏర్పాటైన ఆరునెలల్లోపే వార్డులు విడగొట్టడం, ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవేళ అక్కడ వైసిపి కాకుండా వేరే పార్టీ గెలిచినా ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ప్రత్యేకాధికారి ద్వారా పాలన నిర్వహించే అంశాన్నీ పరిగణలోకి తీసుకోనుంది.