
- అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తాం
- జులై 8 నుంచి ఇళ్ల నిర్మాణం
- 50,793 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ
- 5024కి టిడ్కో ఇళ్లు అందజేత
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అమరావతి ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇచ్చిన స్థలాల్లో జులై 8వ తేదీ నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శుక్రవారం 50,793 మంది పేదలకు ఆయన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జులై 8న ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల నుంచి మూడు ఆప్షన్లను గృహ నిర్మాణ శాఖాధికారులు తీసుకుంటారని తెలిపారు. అమరావతిలో అన్ని సామాజిక తరగతుల వారికీ ప్రాతినిధ్యం కల్పిస్తామని, రాజధాని అమరావతి ఇకమీదట సామాజిక రాజధానిగా మారనుందని అన్నారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తే మురికివాడలు వస్తాయని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకుండా మూడేళ్లుగా అడ్డుకున్నారని విమర్శించారు. ఒక్కో పేద మహిళకు తాను రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన స్థలాన్ని ఇస్తున్నానని తెలిపారు. మొత్తం 25 లేఅవుట్లలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఇవి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు సామాజిక న్యాయ పత్రాలు కూడా అని సిఎం వ్యాఖ్యానించారు. రాజధానిలో పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు అదే ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రం, విలేజి క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ప్రాథమిక పాఠశాల, పార్కులతోపాటు అన్ని మౌలిక సదుపాయాలూ కల్పిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం వెంకటపాలెం సభలోనే పంపిణీ చేశారు. వాటిని తానే కట్టించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేవలం స్లాబులు వేసి వదిలేస్తే పేదలు ఉంటారా? మౌలిక సదుపాయాలు కల్పించని చంద్రబాబుకు టిడ్కో ఇళ్ల గురించి మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. తాము రూ.245 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. 300 అడుగుల ఇంటికి రూ.3 లక్షల రుణం ఇచ్చి నెలకు రూ.3 వేలు చొప్పున 20 సంవత్సరాలు కట్టాలంటూ చంద్రబాబు సర్కార్ నిర్ణయిస్తే, తాను మౌలిక సదుపాయాలు కల్పించి ఒక్క రూపాయికే పేదలకు టిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామన్నారు. నాలుగేళ్లలో రూ.2.11 లక్షల కోట్ల పేదల ఖాతాల్లో వివిధ పథకాల (డిబిటి) ద్వారా జమ చేశానని తెలిపారు. నాన్ డిబిటిలో ఇతర సంక్షేమ పథకాల ద్వారా మరో రూ.89 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తంగా రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు తానేటి వనతి, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గన్నారు.