Sep 17,2023 07:13

ఆడపిల్ల పదిమందిలో నవ్వితే అరిష్టం అని నవ్వుని ఆదిలోనే అణచివేసే నేపథ్యమున్న సమాజం మనది. నవ్వు నష్టదాయకం కాదు; ఆనందకారకం అని ఆమె నమ్ముతుంది. అందుకే ఆమె వందలాదిమందినీ మనసారా నవ్విస్తోంది. ఆమె ముంబయికి చెందిన స్టాండప్‌ కమెడియన్‌ ఊర్జ్‌ అస్ఫాఖ్‌. ఇటీవల ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఫ్రెంజీ ఫెస్టివల్‌లో కామెడీ ప్రపంచంలో ఆస్కార్‌గా పిలుచుకునే 'పెర్రియర్‌' అవార్డును సొంతం చేసుకున్నారు. 'పెర్రియర్‌' అవార్డుల 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి అవార్డు దక్కిన భారతీయ కమెడియన్‌గా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.

తనకెదురైన ప్రతి చిన్న అనుభవానికి నవ్వులు జోడించడం, ఛలోక్తులతో ఎంతటి సీరియస్‌ విషయంపైనైనా హాస్యం పండించడం ఊర్జ్‌కు తెలుసు. చాలా సాధారణ విషయాల పైనే ప్రేక్షకులను పగలబడి నవ్వేలా చేస్తారు ఆమె. ఇప్పుడు ఇంతలా నవ్వులు పూయిస్తున్న ఊర్జ్‌ బాల్యం నిత్య సంఘర్షణలతో నిండి ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రుల విడాకులు ఆమెకు అందమైన బాల్యం లేకుండా చేశాయి. ఒంటరి తల్లి పెంపకంలో పెరిగిన ఊర్జ్‌ సైకాలజీ విద్యార్థిగా మాస్టర్స్‌ చేయాలని కలలు కంది. అయితే అది నెరవేరలేదు. తరువాత ఆమె కామెడీ రంగంవైపు మళ్లారు.

నా ప్రయాణం ఇలా మొదలైంది!

'స్టేజీ షోలు ఇవ్వడం చాలా ఇష్టం. స్కూలు, కాలేజీల్లో ఎప్పుడూ స్నేహితులతో కామెడీ చేస్తూ ఉండేదాన్ని. నన్ను 'క్లాస్‌ ఆఫ్‌ కామెడీ'గా పిలిచేవారు. అయితే అదే నా జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని నాకు అప్పుడు తెలియదు. సైకాలజీ తరువాత కాలేజీలో సీటు రాక ఏడాది విరామం వచ్చింది. అప్పుడే ఏదైనా ఉపాధి వెతుక్కుందామనుకున్నాను. తొలుత 'ఎఐబి'లో రైటర్‌గా ఉద్యోగం సంపాదించాను. ఆ తరువాత నాకిష్టమైన కామెడీ రంగం వైపు అడుగులు వేశాను. 'హో నో' పేరుతో నేను చేసిన స్టాండప్‌ కామెడీ షోలకు ఇంతలా ఆదరణ వస్తుందని నేను ఊహించలేదు.

2

మొదట్లో ఎన్నో విమర్శలు

ఆడపిల్లలు గట్టిగా నవ్వితేనే హర్షించని సమాజం మనది. అటువంటిది ఓ మహిళ కామెడీ చేస్తుందంటే అంగీకరిస్తుందా? ఊర్జ్‌ ప్రయాణం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. 'ఓ మహిళ జోక్స్‌ వేస్తుంటే ఎవరూ వినాలనుకోరు, చూడాలనుకోరు. నాకు కూడా అటువంటి అనుభవం ఎదురైంది. రకరకాల అనుభవాలు, ఆలోచనలతో కామెడీ చేస్తున్న నన్ను చూడడానికి చాలామంది ఇష్టపడలేదు. అప్పుడు ఎంతో మానసిక వేదనకు గురయ్యాను. అయినా వెనుకడుగు వేయలేదు' అంటూ ఆమె వివరించారు.

ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను

ఇంతలా అవమానాలు పడిన ఆమె ఆ తరువాత చాలా స్వల్ప కాలంలోనే నిలదొక్కుకున్నారు. 'ప్రముఖ స్టాండప్‌ కమెడియన్స్‌ సౌరవ్‌ మోహతా, అభిష్‌ మాథ్యూలతో చెన్నైలో ఓ షో చేస్తున్నాను. అప్పుడు అకస్మాత్తుగా కరెంటు పోయింది. అయితే షోకు ఆటంకం కలగకుండా ప్రేక్షకులు తమ ఫోన్లతో ఫ్లాష్‌ లైట్లు వెలిగించారు. ఎంతలా అంటే హాలు మొత్తం వెలుగుతో నిండిపోయింది. ఇలాగే ఎన్‌సిపిఎలో జరిగిన పెద్ద ఈవెంట్‌లో వెయ్యి మంది కూర్చొన్న ఆడిటోరియంలో ఒక్కసారిగా కరెంటుపోతే ఫ్లాష్‌ లైట్లతో షోను కొనసాగించమని, ఇబ్బంది పడొద్దని ప్రేక్షకులు మాకు అండగా నిలబడ్డారు. ఈ రెండు సందర్భాలు నాకు మర్చిపోలేని అనుభూతిని పంచాయి' అంటూ ఆమె చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో సంతోషపు మెరుపు.

jeevana

వ్యక్తిగత అనుభవాలతోనే ...

'హో నో' పేరుతో ఆమె చేసే స్టాండప్‌ కామెడీషోలో ఊర్జ్‌ - తనకు ఎదురైన, ఎదురౌతున్న ప్రతి అనుభవాన్ని, అది కష్టాలమయమైనా, భరించలేని నొప్పైనా సరే ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. పీరియడ్‌ సమస్యతో బాధపడుతూ ఒకసారి స్టేజ్‌ షో చేసింది ఆమె. ఆ అంశాన్ని కూడా చాలా ఛలోక్తులతో మేళవించి ప్రదర్శన చేసింది. అవార్డు తీసుకున్న 'ఫ్రింజ్‌' వేదిక మీద కూడా తన తల్లిదండ్రుల విడాకులు, మానసిక సంఘర్షణతో కౌన్సిలింగ్‌కు వెళ్లడం వంటి అతి దు:ఖమయ సంఘటనలపై ఛలోక్తులు విసిరింది. ఉదాహరణకు 'ఈ థెరపీ చాలా ఖరీదైనది. చాలా మంది దాన్ని భరించలేరు. కాబట్టి నేను నా స్నేహితుల సమస్యలను అక్కడికి తీసుకెళ్తాను. అప్పుడు వారు కూడా నావారేనని భావిస్తాను. ఇదో రకం సంతోషం అన్నమాట' అని ప్రేక్షకుల చప్పట్ల మధ్య చెప్పింది.

వర్తమాన అంశాలపై స్పందన

ప్రేక్షకులను నవ్వులతో మైమరిపించడమే కాదు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై తనదైన శైలిలో స్పందించడం కూడా ఊర్జ్‌కి తెలుసు. గతంలో సిఎఎ బిల్లుపై తనదైన శైలిలో ఆమె స్పందించారు. ముంబయి క్రాంతి మైదాన్‌లో జరిగిన సిఎఎ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని తన సంఘీభావం తెలియజేశారు. ఆ కార్యక్రమం తరువాత ఆమెను చాలామంది నిందిస్తూ తిడుతూ వ్యాఖ్యలు చేశారు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. మధ్యప్రదేశ్‌లో ఓ యజ్ఞం జరిగిన సందర్భంలోనూ ఆమె చేసిన ట్వీట్‌ కొందరి విద్వేషానికి గురైంది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తొణకని, బెదరని వ్యక్తిత్వం ఆమెది. 'ఈ బెదిరింపులు నన్నేమీ చేయలేవు. మళ్లీ మళ్లీ ఇలాగే చేస్తాను' అంటూ ఆమె స్పందించారు.
నవ్వడం, నవ్వించడమే కాదు.. తనపై నిందలు వేసిన, తనవారిని దూషించిన వారిపై నిప్పులు చెరగడం కూడా తెలిసిన ఊర్జ్‌ ఎంతోమందికి స్ఫూర్తి. మున్ముందు ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.