Jun 23,2022 12:18

ప్రజాశక్తి - విజయనగరం : అర్హులు అందరికీ ఇస్తున్నామనివిద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లాలో అమత్‌ పథకంలో భాగంగా రూ.196 లక్షల వ్యయంతో నిర్మించిన 1500 కే.ఎల్‌.సామర్థ్యం గల వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లను గురువారం ఆయన ప్రాంరభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్‌లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. 2019 కంటే ప్రస్తుతం అధికంగానే ఫలితాలు వచ్చాయన్నారు. అమ్మ ఒడి అర్హులు అందరికీ ఇస్తున్నామని 75 శాతం హాజరు వుండాలని ముందు నుంచే నిబంధన ఉందని ఆయన గుర్తు చేశారు. నగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్‌ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని తెలిపారు. మూడేళ్లలో 7600 కిలో లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్‌ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కె.ఎల్‌.పురం, ధర్మపురిలో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘు వర్మ, మేయర్‌ వి. విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌లు కోలగట్ల శ్రావణి, ఇ.రేవతి, మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్‌. శ్రీరాములు నాయుడు, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ బిహెచ్‌. శ్రీనివాస రావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, 33వ వార్డు కార్పొరేటర్‌ జి.వి.రంగారావు, నగర కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.