Jul 04,2022 07:52

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కెమిస్ట్‌ కోలే హత్య కేసులో సూత్రధారుడిగా అనుమానిస్తున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ (35)ను పోలీసులు అరెస్టు చేసి, ఆదివారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరుపరచగా, జూలై 7 వరకు అతడికి పోలీసు కస్టడీ విధించారు. కెమిస్ట్‌ హత్యకు ఇతర నిందితులను పురిగొల్పింది ఇర్ఫానే అని సిటీ కొత్వాలి పోలీసు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమా ఆరాజ్‌ మేజిస్ట్రేట్‌ ముందు వాదించారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ మొబైల్‌ ఫోన్‌, ద్విచక్ర వాహనం, నాలుగు చక్రాల వాహనాలను (నేరంలో ఉపయోగించినది) రికవరీ చేయడానికి, అతను నడుపుతున్న హెల్ప్‌లైన్‌ సంస్థ బ్యాంక్‌ ఖాతా వివరాలను సేకరించేందుకు తమకు ఇర్ఫాన్‌ ఖాన్‌ కస్టడీ అవసరమని ఆమె మెజిస్ట్రేట్‌ను కోరారు. ''నా క్లయింట్‌ ఒక సామాజిక కార్యకర్త , కోవిడ్‌ మహమ్మారి సమయంలో చాలా మందికి సహాయం అందించారు. ఆయన ఘటనా స్థలంలో లేరని, నేరంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడి తరపు న్యాయవాది ముర్తుజా ఆజాద్‌ మరో న్యాయవాది వసీం షేక్‌తో కలిసి వాదించారు.డిఫెన్స్‌ లాయర్‌ వాదనను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కౌంటర్‌ చేస్తూ, నిందితుడే ప్రధాన కుట్రదారు అని ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ ఏఆర్‌ కల్హాపురే ఇర్ఫాన్‌ ఖాన్‌ను 7 వరకు పోలీసు కస్టడీకి తరలిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ హత్య కేసులో ఇంతవరకు ఏడుగురిని అరెస్టు చేశారు. కేంద్ర హౌంశాఖ అదే రోజు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించింది. కెమిస్ట్‌ కోలే మహ్మద్‌ ప్రవక్తపై నోటి దూలతో వ్యాఖ్యలు చేసిన బిజెపి మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారని ఫిర్యాదులున్నాయి. గత నెల 21న రాత్రి పదిగంటలకు ఇంటికి వెళుతున్న ఉమేశ్‌ను మోటార్‌ బైక్‌పై వచ్చిన కొంత మంది వెంబండించి కత్తులతో దాడి చేసి నరికి చంపేశారు. తొలుత దోపిడీ కేసుగా భావించగా.. ఇప్పుడు ఉదరుపూర్‌ ఘటన అనంతరం. దీనిపై దృష్టి సారించగా.. ఉమేష్‌ పోస్టే కారణమని నిర్ధారించారు. ఈ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌, ముదస్సిర్‌ అహ్మద్‌, షారూక్‌ పఠాన్‌, అబ్దుల్‌ షేక్‌ తస్లీమ్‌, షోయమ్‌ ఖాన్‌, అతిబ్‌ రషీద్‌, యూసఫ్‌ ఖాన్‌లను అరెస్టు చేశారు. ఉమేష్‌ను చంపితే 10వేలు ఇస్తానని ఇర్ఫాన్‌.. ఇతర నిందితులకు మభ్య పెట్టినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అప్పగించారు.

 </p>


ఉదయ్ పూర్‌ ఘటన నిందితులకు 10 రోజుల కస్టడీ
ఉదయ్ పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ హత్య కేసులో నిందితులను జైపూర్‌ కోర్టులో హాజరుపర్చగా.. 10 రోజుల జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీకి అప్పగించింది. ప్రధాన నిందితులు రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మహ్మద్‌తో పాటు మరో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచిన తర్వాత.. వాహనం ఎక్కించేందుకు బయటకు తీసుకు రాగా.. భారీ గుంపు వీరిపై దాడి చేసింది. కొట్టడం, తన్నడం, దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు వారిని వాహనంలోకి ఎక్కించి .. అక్కడి నుండి తరలించారు.<