Dec 02,2022 08:20

భారతదేశ ప్రాచీన కళగా ప్రసిద్ధిచెందిన కలంకారీ కళకు చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి ప్రసిద్ధి. నేడు దేశవిదేశాల్లో విశేష ప్రజాదరణ పొందిన ఈ కళ తొలితరం కళాకారులు ఆ ప్రాంతం వారే. అంతరించిపోతున్న ఎన్నో ప్రాచీన కళల జాబితాలోకి కలంకారీ కళ చేరకుండా ఆ కళాకారులు చేస్తున్న నిర్విరామకృషి వెలకట్టలేనిది. అలా ఏమాత్రమూ ప్రజాదరణ లేని కాలం నుంచి ప్రస్తుత ప్రాభావ్యం కొనసాగుతున్న రోజుల వరకు ఈ కళనే నమ్ముకుని ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తి వేలాయుధం శ్రీనివాసుల రెడ్డి. కళపై ఉన్న మక్కువ నేడు ఆయనను జాతీయస్థాయి అవార్డుకు ఎంపికచేసింది. కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'శిల్పగురు' అవార్డు వరించిన సందర్భంగా జీవనతో ఆయన పలు విషయాలు ముచ్చటించారు.
           'నేను పుట్టి పెరిగింది శ్రీకాళహస్తి. ఐదేళ్ల వయసప్పుడే నాన్న చనిపోయారు. కుటుంబ భారం మొత్తం అమ్మపై పడింది. ఒంటిచేత్తో ఐదుగురు బిడ్డల ఆలనాపాలనా చూసిన ఆమె పెంపకంలో పెరిగిన నేను బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించాను' అంటున్న శ్రీనివాసులు తల్లి ఆడపిల్లల పెళ్లి చేసిన తరువాత కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం తపనపడింది. కానీ చదువులో చురుకుగా ఉంటున్న కొడుకును పదోతరగతి మించి చదివించలేని స్థోమత ఆమెది. అయితే విద్యార్థిగా రకరకాల బొమ్మలు వేసే కొడుకు ఆసక్తిని గమనించి అప్పుడప్పుడే శ్రీకాళహస్తిలో సొగసులద్దుకుంటున్న కలంకారీ కళలో తర్ఫీదుకు పంపింది. అలా కృష్ణారెడ్డి దగ్గర కలంకారీ కళలో శ్రీనివాసులు తొలి అడుగు పడింది. ఆ తరువాత ఎల్‌ కృష్ణయ్య వద్ద కలంకారీలో డిప్లోమా చేశారు శ్రీనివాసులు. ఇదంతా 1980లో జరిగిన సంగతి.
 

                                                                  ఆనాటి కలంకారీ..

'ప్రాచీన కళగా దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం ఉన్న కలంకారీ కళకు ఆనాడు ఇప్పుడున్నంత ఆదరణ లేదు. మీటరు నుంచి 15 మీటర్ల పొడవున్న గాడా వస్త్రంపై(ఒకలాంటి నేత) రామాయణ, మహాభారత ఘట్టాలు చిత్రించేవారు. వాటిని దేవాలయాల్లో గోడచిత్రాలుగా అమర్చేవారు. భారతదేశ చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ వస్త్రాలను విదేశీయులు ప్రత్యేకంగా తయారు చేయించుకుని వెళ్లేవారు. అంతకుమించి మరే ఇతర రూపాల్లో కలంకారీ కళ ప్రజలకు చేరువకాలేదు' అంటూ నాటి విషయాలు గుర్తుచేసుకున్నారు.
 

                                                             ప్రాచీన కళ.. 17 దశలు..

'గాడా వస్త్రానికి గంజిపెట్టి ఆరబెడతారు. చిక్కటి బర్రెపాలు, నానబెట్టి రుబ్బిన కరక్కాయ గుజ్జు కలిపిన మిశ్రమాన్ని జాడాకు బాగా పట్టిస్తారు. ఆ తరువాత ఎండబెట్టిన జాడాపై రంగులు అద్దడం ఓ పెద్ద ప్రహసనం. తాటిబెల్లం, మంచిబెల్లం కలిపి పానకంలా చేసి అందులో తుప్పుపట్టిన ఇనుపముక్కలను ఓ కుండలో 15 రోజులు నానబెట్టి ఇంకును తయారుచేస్తారు. దాంతో జాడాపై ముందుగా చింతచెట్టు పుల్లలతో సిద్ధం చేసుకున్న బొమ్మలపై ఒక క్రమపద్ధతిలో రంగులద్దడం మొదలుపెడతారు. జాడాపై ఇంకుతో దిద్దుతున్నప్పుడు ఆ చిత్రం నలుపురంగులో తయారవుతుంది. ఎరుపు రంగు రావడం కోసం పటిక పొడిని బొమ్మ అడుగు భాగంపై జల్లుతారు. ఆ తరువాత అనవసర పటిక పొడి వదిలేలా జాడాను ప్రవహించే నీటిలో పెడతారు. అయితే పటిక పొడి పూర్తిగా వదలదు. దీంతో జాడాకు మొదట చేసిన పద్ధతిలో కరక్కాయ గుజ్జును పట్టించి చేవాలపొడి, సురులపట్ట వేసిన మరుగుతున్న నీటిలో ఉడకబెడతారు. ఇప్పుడు పటిక ఉన్న చోట అంతా ఎరుపు రంగులో పటిక లేని చోట గులాబీ రంగు వస్తుంది. ఇక ఇప్పుడు అనవసరంగా ఉన్న గులాబీ రంగును వదిలించడం కోసం గొర్రె పెంటికలతో పేడనీళ్లు తయారుచేసి అందులో రాత్రంతా నానబెడతారు. ఉదయాన్నే నదీతీరం వెంబడి ఇసుకతిన్నెల్లో సూర్యరశ్మి బాగా తగిలేచోట జాడాను ఎండబెడతారు. అలా మూడురోజులు ఒకవైపు, ఇంకో మూడు రోజులు రెండోవైపు ఎండిన జాడాలో గులాబీ రంగు పూర్తిగా పోతుంది. ఇప్పుడు జాడాకు మళ్లీ గేదెపాలను పట్టిస్తారు. కరక్కాయ పువ్వును మరిగించి పసుపు రంగు తయారుచేసుకుంటారు. నీలి ఆకులతో ఇండికా రంగును సిద్ధం చేసుకుంటారు. సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే రంగులద్దుతారు. ఇలా ఎంతో కఠోర శ్రమ చేసిన తరువాత కలంకారీ కళ సిద్ధమవుతుంద'ని ప్రాచీన కలంకారీ ప్రాశస్త్యం గురించి శ్రీనివాసులు చెబుతున్నప్పుడు ఆయనలో మనకు చేయి తిరిగిన కళాకారుడు కనపడతాడు.
'అసలైన కలంకారీ కళ ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడొస్తున్న కలంకారీ చీరలు, దుపట్టాలు, ఇంకా రకరకాల వస్త్రాలపై వస్తున్న కళ రూపం మారింది. మారుతున్న రోజులకు అనుగుణంగా కలంకారీ తన రూపం మార్చుకుంది. బతుకుదెరువు కోసం మనసుకు కష్టంగా ఉన్నా నేనూ అప్పుడప్పుడూ కలంకారీ చీరలు తయారుచేస్తుంటాను' అంటూ చెబుతున్నప్పుడు ఆయన మాటల్లో ఎంతో ఆవేదన ప్రతిధ్వనిస్తుంది.
 

                                                           'శిల్పగురు' పెయింటింగ్‌..

ఒక పెయింటింగ్‌లో నవగ్రహాలు, శ్రీచక్రంలో అష్టలక్ష్ములు, దశావతరాలు వేసిన మరో పెయింటింగ్‌, ఇంకో పెయింటింగ్‌లో పద్మవ్యూహం చిత్రించి అవార్డు కోసం పంపించారు. 'కాళహస్తి నుంచి చాలామంది కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపువచ్చింది. నేను వారికి భిన్నంగా ఎంచుకుని ఇప్పుడు ఈ అవార్డు అందుకున్నాను' అంటున్నారు శ్రీనివాసులు.

 

An-ancient-Kalamkari-master


 

                                                                చరిత్ర గురించి చెబుతూ..

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో విశేష ప్రజాదరణ పొందిన కలంకారీ కళ ఆ తరువాతి కాలంలో అంతరించే దశకు చేరుకుంది. అలా కలంకారీకి పుట్టినిల్లైన కాళహస్తిలో ముగ్గురు కళాకారులు మాత్రమే మిగిలారు. 1957లో కళా ఉద్యమకారిణి కమలాదేవీ ఛటోపాధ్యాయ కలంకారీ గురించి పుస్తకాల్లో చదివి కళాకారులను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అయితే ఈ కళ చాలా పవిత్రమైనది. ఇతర కులాలు చేయడానికి వీలు లేదు అంటూ కళను నేర్పించేందుకు ఇద్దరు కళాకారులు తిరస్కరించారు. ముగ్గురిలో జొన్నలగడ్డ లక్ష్మయ్య మాత్రమే కళను ఇతరులకు పంచేందుకు ముందుకు వచ్చారు. అలా అప్పుడు మొదలైన శిక్షణాకేంద్రాల్లో మొదట ఆరుగురు విద్యార్థులే ఉండేవారు. క్రమంగా దేశంలో కలంకారీకి ఆదరణ పెరగడంతో ప్రస్తుతం ఎంతోమంది కళాకారులు దేశ నలుదిశలా విస్తరించారు. కలంకారీ కళను విదేశాలకు ఎగుమతులు చేయడంలో కూడా ఎంతోమంది ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం కాళహస్తి మొత్తం మీద 1500 కుటుంబాలకు చెందిన 5 వేల మంది స్త్రీ, పురుష కళాకారులు దీనిపై ఆధారపడుతున్నారు. మచిలీపట్నం, అనంతపురం, హైద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు కళ విస్తరించింది.
            'బతుకుదెరువు కోసం ఎంతోమంది కళాకారులు నూతన ఒరవడిలో కొట్టుకుపోతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా... ఆకలి బాధ తీరాలన్న తప్పదు.. కాని నేను ఆ మార్గంలో నడవలేకపోయాను. ఎంతో ప్రాశస్త్యమున్న ప్రాచీన కళ రూపం మారిపోతుందని ఎంతో బాధపడుతుంటాను. ఆ బాధ మాటల్లో చెప్పలేను. గత్యంతరం లేక ఆధునిక పోకడలను అనుసరిస్తున్నా ప్రాచీన కళ జీవం పోకుండా కాపాడడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాను. జొన్నలగడ్డ కుటుంబం వారు పలు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆ కుటుంబం తరువాత నాకే 'శిల్పగురు' అవార్డు వచ్చింది. ఈ అవార్డు నాకు కాదు. నా కలంకారీ కళకు' అంటున్నారు ఎంతో ఆనందంగా..

An-ancient-Kalamkari-master


                                                                      అవార్డులు

1994లో తమిళనాడు ప్రభుత్వం నుంచి రాష్ట్ర అవార్డు వచ్చింది. 2010లో ఆంధ్ర ప్రభుత్వం నుంచి లేపాక్షి అవార్డు, 2014లో కేంద్ర ప్రభుత్వం నుంచి 'జాతీయ నైపుణ్య' అవార్డు దక్కింది.

                                                                                                                 - జ్యోతిర్మయి