Jul 03,2022 17:57

వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వర్షా కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో తగినన్ని మార్పులు తప్పక చేసుకోవాలి.

- ఈ కాలంలో తరచూ మొక్కజొన్న  తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా వుంటుంది. లుటిన్‌, పైటోకెమికల్స్‌ ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

- వర్షాకాలంలో తినదగిన మరో ఆరోగ్యకరమైన పండు బొప్పాయి. ఇది తీసుకోవడం వల్ల జరిగే యాంటీ పైరెటిక్‌ చర్య వర్షాకాలంలో తరచూ వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలను నివారిస్తుంది.

- ఈ కాలంలో లభించే ఆపిల్‌, దానిమ్మలను ఎక్కువగా తినాలి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.

- అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారుచేసిన హెర్బల్‌ టీ తరచూ తీసుకోవాలి. వీటిలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.

- తాజా ముల్లంగిరసం తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

- మొక్కజన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.

- ముడిబియ్యం, ఓట్స్‌, బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

- వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో ఎక్కువగా వాడాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

- అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడే విటమిన్లు, ఖనిజాలు, ఆస్కార్బిక్‌ ఆమ్లం (విటమిన్‌ సి), రెటినాల్‌ మన శరీర రోగనిరోధక శక్తిని అధికంగా ఉంచడంలో సాయపడతాయి.