Jun 21,2022 18:58

బిడ్డ పుట్టాక తల్లి ఆలోచనలు ఆ పసికందు గురించే. తనకు అవసరమైనవి సమకూరుస్తూ, మంచి ఆహారం, ఆరోగ్యం ఇవ్వాలన్న తపనతో నిత్యం ఉంటుంది. కూతురు కోసం తల్లి ఏదైనా చేయగలదు. ఎంతటి కష్టమైనా భరించగలదు అని ప్రేరణ మిశ్రా నిరూపించారు. కూతురి అనారోగ్యం ఆమెను కుంగదీసింది. తన అధిక బరువు కూతురు చికిత్సకు సమస్య కాకూడదనుకుంది. దాని కోసం ఎంత కష్టపడిందో, ఏవిధంగా శ్రమించి బరువు తగ్గించుకుందో తన మాటల్లోనే విందాం.
'మాది లక్నో. చిన్నప్పడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఏదైనా ఒత్తిడికి లోనైతే బాగా తినడం అలవాటు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఏదో తెలియని భయం, ఆందోళన వెంటాడాయి. దాంతో ఎక్కువ తినడం ప్రారంభించాను. అప్పటినుంచి బరువు పెరగడం మొదలైంది. అమ్మనాన్న ఇంటర్‌ తర్వాత నాకు పెళ్లి చేశారు. అత్తవారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏవేవో సమస్యలు. వాటిని తట్టుకుని నిలబడ్డాను. పాప పుట్టింది. నాలుగేళ్లయింది. భర్త ఉద్యోగం కోసమని జర్మనీలో హాంబర్గ్‌ వెళ్లాడు. ఆ సమయంలో నేను పాపను చూసుకుంటూ ఉన్నాను. ఎన్ని నెలలైనా ఆయన దగ్గర నుంచి సమాచారం లేదు. చాలా ప్రయత్నాలు చేశా. లాభం లేకపోయింది. ఒంటరితనానికి అలవాటుపడ్డాను. మానసిక ఆందోళన పెరిగింది. అప్పుడు ఎక్కువ ఫుడ్‌ తీసుకున్నా. తెలియకుండా బరువు పెరిగాను. 35 ఏళ్ల వయసుకు 93 కిలోల బరువు ఉన్నాను. పెద్దదానిలా కనిపించేదాన్ని. బయటకు వెళ్లడం మానేశా. ఇంట్లోనే ఒంటరిగా గడిపేదాన్ని.
 

1

ఊహంచని ఉత్పాతం!
అప్పుడే నా కూతురు అనైషాకు బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఈ విషయం నా భర్తకు ఎలాగైనా చెప్పాలనుకున్నా. అతని మెయిల్‌ ఐడి తెలుసుకుని సమాచారం ఇచ్చాను. అప్పుడే లాక్‌డౌన్‌ విధించారు. తాను రానని, అక్కడే స్థిరపడిపోతానని చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా కూతురు బాధ్యత ఇక నాదే అనుకొని ధైర్యమంతా కూడకట్టుకున్నా. వైద్యం చేయించడానికి మానసికంగా సిద్ధపడ్డా. కాని నా అధిక బరువు వల్ల ఆమెను తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. అనైషాను ఎత్తుకుని మెట్లెక్కలేక ఆయాసం, రొప్పు వచ్చేవి. కీమోథెరపీ సెషన్స్‌ సమయంలో తను గంటల తరబడి నా ఒడిలో కూర్చునేది. అప్పుడు నేను చాలాసేపు కదలేకపోయేదాన్ని. విపరీతమైన వెన్ను నొప్పి వచ్చేది. అనైషాను ఎత్తుకుని వాష్‌రూమ్‌కు కూడా తీసుకెళ్లలేక ఇబ్బంది పడ్డాను. త్వరగా అలసిపోయేదాన్ని. వీటన్నిటికి కారణం నా అధిక బరువని అర్థమైంది. నెలరోజుల్లో అనారోగ్యానికి గురయ్యా. దాంతో అనైషా వైద్యం వాయిదా పడుతూ వచ్చింది. పాపను సరిగ్గా చూసుకోలేకపోతున్నానన్న భావన, నా అధిక బరువు సమస్య నన్ను స్థిమితంగా ఉండనివ్వలేదు. నేను ఆరోగ్యంగా ఉంటేనే నా కూతుర్ని చూసుకోగలనని అర్థమయ్యింది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని నిశ్చయించుకున్నా. అప్పుడే వెయిట్‌లాస్‌పై దృష్టి పెట్టా.

3


10 నెలల్లో 23 కిలోలు తగ్గా
స్కూల్లో ఉన్నప్పుడు నేను అథ్లెటిక్స్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడేదాన్ని. బహుమతులూ వచ్చాయి. కథక్‌ నృత్యం కూడా నేర్చుకున్నా. పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నా కూతురు ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆమె వైద్య చికిత్స సుదీర్ఘంగా ఉంటుంది. అందుకు నేను ఫిట్‌గా ఉండాలి. నా కోసం నేను సమయం కేటాయించుకున్నా. ఇంట్లోనే వ్యాయామం చేయడం ప్రారంభించా. మొదట్లో శరీరం సహకరించలేదు. పదిరోజులకే కష్టమనిపించింది. అయినా ప్రతిరోజూ గంట వ్యాయామం, మరొక గంట యోగా చేశా. ఆహారం కొంచెంకొంచెంగా తినడం అలవాటు చేసుకున్నా. రెండు, మూడు నెలలకు మానుకుందాం అనుకున్నా. మధ్యలో గ్యాప్‌ ఇచ్చి మళ్లీ చేశా. తర్వాత ఎప్పుడూ వ్యాయామం ఆపలేదు. ఇంట్లో ఉన్న బరువైన వస్తువులు ఎత్తడం, దించడం, బ్యాండ్‌లను లాగడం చేశాను. సైక్లింగ్‌, స్కిప్పింగ్‌, జంపింగ్‌ చేశా. నేను అలా చేయడం చూసి, నా అపార్టుమెంట్‌లో వాళు ్ల'కూతుర్ని వదిలిపెట్టి.. నువ్వు ఇలా అందం పెంచుకుంటున్నావా' అనేవారు. వారికలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. నా అనారోగ్య సమస్య, బాధ వారికి కనిపించలేదు. ఒక్కోసారి అనైషాని ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆ రోజు వ్యాయామం చేయడం కుదిరేది కాదు. తాను నిద్రపోయాక ఆసుపత్రిలోనే మేముండే గదిలోనే కసరత్తులు చేసేదాన్ని. అలా ఒక్కరోజూ కూడా ఆపకుండా చేయడం వల్ల బరువు తగ్గుతూ వచ్చాను. ఒత్తిడి వల్ల ఆకలి వేసినప్పుడు మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకున్నా. రోజులో నాలుగు లీటర్ల మంచినీళ్లు తాగేదాన్ని. అరగంట పాటు మెట్లు ఎక్కడం, దిగడం చేశా. అలా పది నెలల్లో 23 కిలోలు తగ్గా' అని వివరించారు ప్రేరణ మిశ్రా.
కూతురిపై ఉన్న ప్రేమ ఒక్కటే ఆమెను ఇంతగా కష్టపడేలా చేసింది. సమాజంలో ఒంటరి మహిళలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ తోడూ లేకుండా ఎదుర్కోవడం కష్టమే! అయినా తమను తాము ప్రేమించుకుంటూ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే ఎంతటి కుదుపులైనా దాటొచ్చు అనడానికి ప్రేరణ జీవితమే ఒక ఉదాహరణ.