
పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలకు చదువుల దీపం అక్కరలేదన్నారు. అలాంటి సమయంలో కందుకూరి, గురజాడ, చలం వంటి వారు స్త్రీలు కూడా మనుషులేనని వారి పక్షాన నిలిచి పోరాడారు. వారి జీవితాల్లో అక్షరాల లాంతర్లు వెలిగించారు. 60 వ దశకం నుంచి స్త్రీలు కథలు, నవలలు విరివిగా రాసి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఒకానొక సమయంలో పురుష రచయితలు కూడా తమ రచనలను ఆడ పేర్లతో పత్రికలకు పంపించారంటే వారి ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 80ల నుంచి స్త్రీలు కవిత్వం రాయడం మొదలు పెట్టారు. 'పురుషాహంకార సమాజాన్ని ధిక్కరిస్తూ తమ బాధలను, సమస్యలను వ్యక్తీకరించారు. అప్పటి వరకు పురుషుల పంజరాల్లో బంధింపబడిన కవిత్వం చిలుక బంధనాలు తెంచుకొని స్త్రీల చేతుల్లో వచ్చి వాలింది.
వచనంలోనూ, కవిత్వంలోనూ స్త్రీలు పురుషులకు తీసిపోకుండా రచనలు చేశారు. ఆత్మకథా ప్రక్రియలో మాత్రం స్త్రీల సంఖ్య తక్కువే. పంజాబీ కవయిత్రి అమృతా ప్రీతమ్ 'రెవెన్యూ స్టాంప్', అజీత్ కౌర్ 'విరామమెరుగని పయనం', బేబీకాంబ్లే 'ప్రిజన్స్ వి బ్రోక్', పి.శివ కామి 'ది గ్రిప్ ఆఫ్ చేంజ్' జిలాని బాను 'మై కౌన్ హు', నళిని 'ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ', రేవతి 'ఒక హిజ్రా ఆత్మకథ' మరాఠీ దళిత స్త్రీ బేబీకొండిబా కాంబ్లే రాసిన 'జినా అచ్చా అవర్ లైవ్స్' ప్రసిద్ధమైన ఆత్మ కథలు.
తెలుగులో కొండపల్లి కోటేశ్వరమ్మ 'నిర్జన వారధి', ముదిగొండ సుజాతారెడ్డి 'ముసురు', భానుమతి 'నాలో నేను', సరస్వతి గోరా 'గోరాతో నా జీవితం', సంగె లక్ష్మి భాయి 'నా జైలు జీవితం', షాజహానా 'మేరా జహా' ముఖ్యమైన ఆత్మ కథలు. కె. వరలక్ష్మి 'నా జీవన యానం', శీలా సుభద్రాదేవి 'నడక దారిలో' ప్రస్తుతం ధారావాహికంగా పత్రికల్లో వస్తున్న స్వీయ చరిత్రలు. ఈ కోవలోకి చెందినదే డా.అమృతలత గారి 'నా ఏకాంత బృందగానం'
కథలు, కవితలు వంటి సృజనాత్మక రచనలు చేయడం వేరు. ఆత్మకథలు రాయటం వేరు .ఆత్మ కథ రచయితకు తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను నిజాయితీగా నిర్భయంగా చెప్పే ధైర్యం ఉండాలి. పుట్టుక, పెళ్ళి, ఉద్యోగం తేదీల సమాహారం కాదు ఆత్మ కథ అంటే. గాంధీ ఆత్మ కథ చదివితే ఆనాటి భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను చదివినట్లే. శ్రీశ్రీ 'అనంతం' చదివితే ఆనాటి ప్రపంచ ప్రఖ్యాత కవులు, వారి కవితా ధోరణుల గురించి తెలుసుకున్నట్లే .
ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో 'పడకల్' అనే మారుమూల గ్రామంలో పుట్టిన ఒక ఆడపిల్ల స్వయంకృషితో తాననుకున్న లక్ష్యాలను సాధించి ఒక వటవృక్షమై పెరిగి ఎందరికో నీడనిచ్చిన వాస్తవ చరిత్ర ఈ స్వీయ చరిత్ర.
70 ఏళ్ళ కిందట ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని అవరోధాలు అధిగమించాలో తెలియచెప్పిన గ్రంథం 'నా ఏకాంత బృందగానం'. చిన్నప్పుడే కన్న తల్లి మరణించడం, ఆ తర్వాత కన్నతండ్రి మరణించడం, చదువుకోవాలనే తపనతో అక్కయ్యల ఊళ్లు, అన్నయ్యల ఊళ్ళకు వెళ్లి మైళ్ళకు మైళ్ళు నడిచి బడికి వెళ్ళి చదువుకోవడం ఆమె జీవితంలో కష్టమైన కాలం. అమృత లత గారికి 15 ఏళ్ళకే బాల్య వివాహం జరగడం, చదువుకోసం పోరాడి చివరకు ఉన్నత విద్యాశిఖరాలు అందుకోవడం, 65 ఏళ్ళ వయసులో పిహెచ్‌డి చేయడం ఆవిడ పట్టుదలకు తార్కాణం. వివాహ విషసర్పం కాటువేయాలని చూసినా తెలివితో దానిని తప్పించుకొన్నారు. సమయోచిత నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు సాగిపోయారు. .ఆమె చిన్నప్పుడు ఆటలాడుతూ చేతి వేళ్ళు పోగొట్టుకొన్నారు. బంధువులు అందరూ వేళ్ళు లేని అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుందని ఎగతాళి చేసినా ఆ మాటలు పట్టించుకోకుండా ఏకాగ్రతతో నిలచి తన లక్ష్యాన్ని సాధించారు. జీవితంలో ఎవరూ ఊహించని ఉన్నత శిఖరాలు అధిరోహించారు.
చదువు, సాహిత్యం ఆమెకు రెండు కళ్ళు. స్కూల్లో చదువుతున్నపుడే కథలు రాశారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి పత్రికల్లో ఆమె కథలు, సీరియల్ నవలలు ప్రచురితమయ్యాయి. 'అమృత్ కిరణ్' అనే పత్రికను కొన్నేళ్ళపాటు నడిపారు.
కాలేజీలో చదువుతున్నపుడు ఇంగ్లీషులో పాఠాలు చెప్తుంటే అర్థంకాక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని విజయ విద్యాసంస్థలు నెలకొల్పారు. కేవలం పాఠాలు చెప్పటం ఒక్కటే కాదని, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తులను మేల్కొల్పాలని ఏటా వార్షికోత్సవాలు. నిర్వహించారు. నాటికలు, నృత్యాలు తదితర సాంస్క ృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు. ప్రభుత్వోద్యోగాన్ని వదులుకొని విద్యాసంస్థలను నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన అపురూప అవార్డులను స్థాపించి సాంస్క ృతిక సాహిత్య కళా రంగాల్లో కృషి చేసిన వారికి 2011 నుంచి ఏటా ఇస్తున్నారు. ఒక సంస్థ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి అవార్డు ఇచ్చి సన్మానం చేయడమే కాకుండా వారిని గురించిన వివరాలతో అభినందన సంచికలు తెస్తున్నారు. ఏది చేసినా సమగ్రంగా సాధికారంగా చేయడం ఆమె ప్రత్యేకత.
ఒకటేరకం దినచర్యల జీవితాల్లో నుంచి కొంచెం మార్పుగా ఏ అందమైన ప్రదేశాల్లోనో పర్యటించినప్పుడు అపరిమితానందం కలుగుతుంది. ఈ విషయం బాగా తెలిసిన అమృతలత తన స్నేహితులతో, బంధువులతో కలిసి దేశ విదేశాల్లో చేసిన పర్యటన విశేషాలు ఈ పుస్తకంలో వివరించారు. కష్టాలు వచ్చినప్పుడు పోరాడి గెలవడమే కాదు; జీవితానికి ఆనంద ఆస్వాదనలనూ అందించాలనన్న పాఠాలు కళ్ల ముందు కదులుతాయి.
జీవితంలో పుట్టుక, చావు ఎంత ప్రధానమైనవో పెళ్ళి కూడా అంత ప్రముఖమైనదే స్త్రీలకైనా, పురుషులకైనా. స్త్రీపురుషులిద్దరూ 'సమానమే అయినా వరకట్నం, కన్యా శుల్కం దురాచారాల చిక్కుముళ్ళలో చిక్కుకున్న స్త్రీలే ఎక్కువ మంది కనిపిస్తారు మనకి. ఆ విషాదాన్ని తట్టుకోలేక దిగులు బావుల్లో కూరుకుపోతారు. అటువంటి క్లిష్ట సమయాల్లోనూ అమృతలత ధైర్యంగా నిలబడ్డారు. ఆ వివాహ బంధం నుంచి బయటపడి తన బతుకు చక్రాలను ముందుకు నడిపించారు.
ఒక విద్యావేత్తగా, ఒక సాహితీవేత్తగా విద్యాసంస్థల నిర్వహణాధికారిగా, పాలనాదక్షురాలిగా, సంపాదకురాలిగా, రచయిత్రిగా అమృత లత బహుముఖ ప్రజ్ఞావంతురాలు. అపురూపమైన స్నేహ బాంధవి. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా తన జీవితంలో తనకు అండదండగా తోడు నిలిచిన బంధువులను మరిచిపోలేదు. అందర్నీ పేరు పేరునా తలుచుకొని వారికి ధన్యవాదములు చెప్పారు. నిండుగా కాచిన చెట్లు ఒంగినట్లు ఆమె ఎన్నో విజయాలు సాధించిన వినయమూర్తి.
ఇంట్లో తల్లి కొట్టినా, బళ్ళో మాష్టారు తిట్టినా ఆత్మహత్యలు చేసుకునే నేటి విద్యార్థులు ముఖ్యంగా ఆడ పిల్లలు తప్పక చదవగలిగిన స్వీయ చరిత్ర. ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా నిలవటం; ఎన్ని సంపదలున్నా కొంచెం కూడా అహంకారం లేకపోవటం, చదువంటే విపరీతమైన ఆసక్తి, జీవన సంగ్రామంలో పోరాడి గెలవడం, ఒక విద్యావేత్తగా, సాహిత్య వేత్తగా, ప్రసిద్ధి చెందడం .. వంటి అంశాలతో ఆదర్శప్రాయంగా నిలుస్తారు అమృతలత. ఈ స్వీయచరిత్రలో ఆనాటి ఆచారాలు, ఆటలు, పండగలు అన్నిటినీ కళ్ళకు కట్టేటట్లు వర్ణించారు. అప్పుడు ఏమి కొనాలన్నా ఇంట్లో వున్న ధాన్యం ఇచ్చి కొనే వస్తు వినిమయ పద్ధతిని, తెలంగాణా సంప్రదాయపు వంటలు పండగలు అన్నిటినీ పరిచయం చేశారు. తన సమకాలీన జీవితంలో దేశానికి, రాష్ట్రానికి ఎవరెవరు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వున్నారో వారి ఫోటోలను ప్రచురించడం బాగుంది. జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించిన ఫోటోలతో సహా అత్యంత ఆసక్తికరంగా వివరించారు. సరళమైన శైలితో ఈ పుస్తకం అందరినీ ఏకబిగిన చదివిస్తుంది. ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూ, కాళ్ళకింద గుచ్చుకొన్న సంప్రదాయపు ముళ్ళను ఏరిపారేస్తూ, అపజయాల అవహేళన రాళ్ళను విసిరి పారేస్తూ తాను అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ, మొక్కవోని దీక్షతో విజయ శిఖరం అందుకొన్న వ్యక్తి ఆత్మకథ ఇది. అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని పోరాడిన ఒక అపురూప గాథ ఇది. ఇది అమృత లత ఒక్కరి కథ కాదు; స్వాభిమానం గల మహిళలందరి బందగానం.
- మందరపు హైమవతి
94410 62732