Nov 23,2022 21:21

బెంగళూరు : విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పరాజయాన్ని చవిచూసింది. బుధవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌-సిలో ఆంధ్రజట్టు 8వికెట్ల తేడాతో ఛత్తీస్‌గడ్‌ జట్టు చేతిలో ఓడింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 42.3ఓవర్లలో 144పరుగులకే కుప్పకూలింది. నితీశ్‌ కుమార్‌(50), అభిషేక్‌ రెడ్డి(29), ఆశ్విన్‌ హెబ్బర్‌(23)మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్లు సుమిత్‌ రూకర్‌(4/23), శుభమ్‌ అగర్వాల్‌(3/50), రవి కిరణ్‌(2/26) బౌలింగ్‌లో మెరిసారు. ఛేదనలో హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా(65నాటౌట్‌), అమన్‌దీప్‌(35నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించడంతో 26.3ఓవర్లలోనే ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. గిరినాథ్‌, షోయబ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. బుధవారంతో ముగిసిన గ్రూప్‌ లీగ్‌ల అనంతరం ఆంధ్రజట్టు 7మ్యాచుల్లో 4విజయాలు, 2పరాజయాలు, ఒక డ్రాతో సహా 18పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు(24పాయింట్లు), కేరళ(20పాయింట్లు) టాప్‌-2లో నిలిచి నేరుగా ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. మిగతా గ్రూప్‌ల సమీకరణాలను బట్టి ఆంధ్రప్రదేశ్‌జట్టు ప్రి క్వార్టర్స్‌కు చేరేది లేనిది తేలిపోనుంది.
హైదరాబాద్‌ గెలుపు..
ఎలైట్‌ గ్రూప్‌-ఏలో హైదరాబాద్‌ జట్టు 110పరుగుల తేడాతో ఛండీగర్‌ఫై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 306పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. భవేశ్‌ సేఠ్‌(71), రోహిత్‌ రాయుడు(68), రాహుల్‌ బుద్ధి(57నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్‌ అర్పీత్‌ పన్నుకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఛత్తీస్‌గడ్‌ జట్టు 46.3 ఓవర్లలో 196పరుగులకే కుప్పకూలింది. గురిందర్‌ సింగ్‌(59) బ్యాటింగ్‌లో రాణించగా.. గంగమ్‌ అంకిత్‌రెడ్డి(3/21), విశాల్‌ శశాంక్‌(3/34), త్యాగరాజన్‌(2/42) బౌలింగ్‌లో మెరిసారు. ఈ గ్రూప్‌లోనూ హైదరాబాద్‌ జట్టు 20 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది.