May 26,2023 08:47
  • తొలి మూడు ర్యాంకులతో పాటు టాప్‌ 10లో ఎనిమిది కైవసం
  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులు సత్తాచాటారు. మొదటి మూడు ర్యాంకులతో పాటు టాప్‌ 10లో ఏకంగా ఎనిమిది ర్యాంకులు సాధించారు. ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని జెఎన్‌ఎఫ్‌ఎయులో విడుదల చేశారు.
          ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్‌ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్‌ విభాగానికి 2,05,351 మంది దరఖాస్తు చేస్తే, 1,95,275 మంది పరీక్ష రాశారు. వారిలో 1,56,879 (80.34 శాతం) మంది అర్హత సాధించారు. ఇందులో 80,672 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 76,536 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 62,814 (82.07 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 1,24,679 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 1,18,739 మంది పరీక్ష రాశారు. వారిలో 94,065 (79.22 శాతం) మంది అర్హత పొందారు. అంటే ఇంజినీరింగ్‌ విభాగంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.85 శాతం అధికంగా ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగానికి 1,15,332 మంది దరఖాస్తు చేయగా, 1,06,514 మంది పరీక్ష రాశారు. వారిలో 91,935 (86.31 శాతం) మంది అర్హత సాధించారు.
ఇందులో 81,205 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 74,881 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 65,163 (87.02 శాతం) మంది అర్హత పొందారు. 34,127 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 31,633 మంది పరీక్ష రాశారు. వారిలో 26,772 (84.63 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.39 శాతం అధికంగా అర్హత పొందారు. 2022లో ఇంజినీరింగ్‌ విభాగంలో 80.42 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగంలో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే ఇంజినీరింగ్‌లో 0.08 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 2.03 శాతం తగ్గడం గమనార్హం. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.