Dec 02,2022 08:17

          ఎన్నో మహమ్మారి వ్యాధులకు విరుగుడు కనుక్కున్న శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్లా ప్రగడ సుబ్బారావు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1895లో జనవరి 12న జన్మించారు. ఏడుగురు సంతానంలో మూడోవాడు. ఆయన చిన్నతనంలో తండ్రి జగన్నాథం అనారోగ్యంతో చనిపోయారు. ఇంట్లో పరిస్థితి అర్థమయ్యి సుబ్బారావు మనసు చదువు మీద నిలవలేకపోయింది. తర్వాత తల్లి ప్రోత్సాహంతో సుబ్బారావు చదువు మీద దృష్టిపెట్టారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజిలో మెడిసిన్‌ చేశారు. చదువుకునే రోజుల్లోనే శేషగిరితో వివాహం అయ్యింది.
         అప్పట్లో గాంధీ స్వదేశీ ఉద్యమం చేత ప్రభావితుడైన సుబ్బారావు బ్రిటిష్‌ వస్తువులని వాడడం మానేశారు. ఎంబిబిఎస్‌ చదివి కూడా మద్రాస్‌ ఆయుర్వేదం కాలేజీలో అనాటమీ లెక్చరరుగా చేరారు. సన్నిహితుల సలహాతో పరిశోధనలు నిమిత్తం 1923లో అమెరికాకు వెళ్లారు. జేబులో 100 డాలర్లతో బాస్టన్‌ నగరంలో దిగాడు సుబ్బారావు. దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ ఆస్పత్రిలో పనిచేస్తూ చదువుకున్నారు. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు నుంచీ ట్రాపికల్‌ మెడిసిన్‌లో డిప్లొమా సాధించాడు. తర్వాత క్రయస్‌ ఫిస్క్‌ అనే శాస్త్రవేత్తకి చెందిన బయోకెమిస్ట్రీ లాబరేటరీలో చేరారు. రక్తంలోను, మూత్రంలోను ఫాస్ఫరస్‌ శాతాన్ని అంచనా వెయ్యడానికి ఓ కొత్త పద్ధతి కనిపెట్టారు. అదే ఫిస్క్‌-సుబ్బారావ్‌ పద్ధతిగా పేరు పొందింది. కండరాల సంకోచమే కాదు సమస్త జీవక్రియలకి శక్తి మూలం ఆడెనొసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ అనే అణువు అని కనుక్కున్నారు. ఈ పరిశోధనే అతడికి డాక్టరేట్‌ పట్టాన్ని తెచ్చిపెట్టింది.
          ఆ తర్వాత తీవ్ర సమస్యగా మారిన ఎనీమియా వ్యాధి మీద ధ్వజం ఎత్తాడు. పంది కాలేయం నుంచి విటమిన్‌ బి12 వెలికి తీసి, ఎనీమియాకి విరుగుడుగా పనిచేస్తుందని నిరూపించాడు. మరిన్ని పరిశోధనల కోసం పెద్ద ఫార్మసూటికల్‌ కంపెనీలో చేరారు. రోజుల తరబడి ల్యాబ్‌లో ఉండి ఫోలిక్‌ ఆసిడ్‌ని కనుగొని ప్రజలను ఎనీమియా భారీ నుంచి రక్షించారు. అక్కడితో ఆగక సుబ్బారావు, అతడి వైజ్ఞానిక బృందంతో కలిసి ఎన్నో వ్యాధికారకాలకు విరుగుడైన యాంటీబయోటిక్స్‌ టెట్రాసైక్లిన్‌ మందు తయారుచేశారు. పోలియో, కాన్సర్‌ వ్యాధుల మందులకు పరిశోధనలూ చేసి ఫలితాలు సాధించి వైద్యవృత్తిలో కొత్త ఆవిష్కరణలు సృష్టించారు. చివరకు 1948, ఆగస్టు 9న గుండెపోటుతో మరణించారు.