Nov 25,2022 22:40
  • అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి
  • గుంటూరులో ప్రారంభమైన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అంగన్‌వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జాతీయ కార్యదర్శి కె.వరలక్ష్మి డిమాండ్‌ చేశారు. రెండు రోజులపాటు జరగనున్న అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభ గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ప్రారంభమైంది. వరలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని, రిటైరైన తర్వాత గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతూ ఉద్యమించాలని వర్కర్లకు, హెల్పర్లకు పిలుపునిచ్చారు. ఆహార భద్రత చట్టం కింద తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తోన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో 16 కోట్ల మంది చిన్నారులు ఉండగా, ఏటా రెండున్నర కోట్ల కొత్త జననాలు నమోదవుతున్నాయని తెలిపారు. వీరిలో 75 లక్షల మంది పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల అయిన సందర్భంగా దేశానికి అమృతకాలం వచ్చిందని చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... పేద పిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్లకు కేటాయించిన విధులను కాకుండా ఇతర పనులను కేటాయించడం తగదన్నారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అంగన్‌వాడీలకు పలు హామీలు ఇస్తున్నాయని, ఎన్నికల అనంతరం వాటిని విస్మరిస్తున్నాయని తెలిపారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టులకు గతంలో కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు కేటాయించేవని, ఇప్పుడు కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించిందన్నారు. మహాసభ గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని రాజ్యాంగంలో నిర్దేశించారని తెలిపారు. పౌష్టికాహార లోపం వల్ల దేశంలో ప్రతి వెయ్యి మందిలో 30 మంది చిన్నారులు చనిపోతున్నారన్నారు. కేరళలో పౌష్టికాహారం సరఫరా సమర్థవంతంగా చేస్తుండడంతో అక్కడ చిన్నారుల మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో ఇద్దరు మాత్రమే మరణిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తోన్న నూతన విద్యా విధానం వల్ల అంగన్‌వాడీ కేంద్రాల మనుగడకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఒకటి రెండు, తరగతులతో కలిపి ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఆచరణలో ఇది సాధ్యం కాదని అన్నారు. పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను టీచర్లుగా నియమిస్తామని నమ్మించి చివరికి ఈ కేంద్రాలను ఎత్తివేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు ప్రస్తుతం గౌరవ వేతనంగా రూ.11000 ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏడవ పే కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, పెన్షన్‌ సదుపాయం వర్తింపజేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు కూడా శ్రమజీవులేనని, వారికి కనీస వేతనాలు, గ్రాట్యుటీ, పెన్షన్‌ సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి సౌహార్థ సందేశం ఇచ్చారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.బేబీరాణి, సుబ్బారావమ్మ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి పాల్గన్నారు. మహాసభకు ముందుగా సంఘం జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బేబిరాణి అవిష్కరించారు. అనంతరం మల్లు స్వరాజ్యం, రంజనా నిరులా చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంవిఎస్‌ స్కూలు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

Anganwadi-Workers-State-10th-Mahasabha-begins