
- ఉన్నతాధికారుల వేధింపులే కారణం : సిఐటియు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : అధికారుల ఒత్తిడికి గురై ఐసిడిఎస్ కోరుకొండ ప్రాజెక్టు పరిధిలోని గాడాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్త ఓరిగంటి సుబ్బలక్ష్మి(45) మరణించారు. ఆమె మృతికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని సిఐటియు నాయకులు తెలిపారు. సిఐటియు నాయకులు, తోటి సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ గాడాల గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా సుబ్బలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లను ఎపి స్టేట్ ఫుడ్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ తనిఖీ చేస్తున్నారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్‌లో అంగన్వాడీ సెంటర్ల తనిఖీకి గురువారం చైర్మన్ వస్తున్నారని అంగన్వాడీలకు ఉన్నతాధికారులు సమాచారమిచ్చారు. దీంతో తాను పనిచేస్తున్న గాడాల-3 అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తారని సుబ్బలక్ష్మి భావించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనై విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురై మరణించారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. సుబ్బలక్ష్మి మృతదేహాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బి.రాజులోవ పరిశీలించారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం, ఐసిడిఎస్ యంత్రాంగం నిరంతరం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.
- వేధింపులు ఆపాలి : బేబీరాణి, సుబ్బరావమ్మ
పుడ్ కమిషన్ చైర్మన్ వస్తున్నారని పదేపదే ఫోన్లు చేయడం వల్ల ఒత్తిడికి గురై అంగన్వాడీ సెంటర్లోనే సుబ్బలక్ష్మి గుండెపోటుతో చనిపోయారని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ పేర్కొన్నారు. రెండు నెలల నుంచి అంగన్వాడీలను అవమానించే విధంగా ఫుడ్ కమిషనర్ విజిట్లు చేస్తూ నానా దుర్భాషలు ఆడటాన్ని తీవ్రంగా ఖండించారు. సుబ్బలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఓ ప్రకటనలో డిమాండు చేశారు.