
- సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- పలు జిల్లాల్లో అడ్డుకోవడానికి పోలీసుల యత్నం, తోపులాట
- ప్రభుత్వ స్పందించకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సత్తా చూపుతాం : సుబ్బరావమ్మ
ప్రజాశక్తి-యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు రాష్ట్ర వ్యాపంగా సోమవారం కదం తొక్కారు. కోర్కెల దినంలో భాగంగా ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, జిఒ-1ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని, వేధింపులు ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో, కలెక్టరేట్ల పరిసరాలు హోరెత్తాయి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి కలెక్టరేట్లలోకి వెళ్లనీయకుండా పలు జిల్లాల్లో అడ్డ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికి, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అన్ని జిల్లాల్లోనూ వేలాదిగా అంగన్‌వాడీలు, ఆయాలు తరలివచ్చారు. కలెక్టర్లకు, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. వీరి పోరాటానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.
రాజమహేంద్రవరం, బాపట్ల, నరసరావుపేట, రాయచోటి కలెక్టరేట్లలోకి పోలీసులను నెట్టుకుంటూ చొచ్చుకెళ్లేందుకు అంగన్‌వాడీలు ప్రయత్నించారు. కలెక్టరేట్ల ప్రధాన ద్వారాలను పోలీసులు మూసివేసి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రతినిధి బృందాన్ని కలెక్టర్లలోకి పోలీసులు అనుమతించారు. ఈ బృందాలు ఆయా జిల్లాల కలెక్టర్ల కలిసి వినతిపత్రాలు అందజేశాయి. రాయచోటిలో జరిగిన తోపులాటలో ఇద్దరు అంగన్‌వాడీ స్పృహ తప్పి పడిపోయారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల ధర్నాలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాల విధానాల వల్ల అంగన్‌వాడీల సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా ఏమిటో నిరూపిస్తారని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్ పాల్గని మద్దతు తెలిపారు. కాకినాడ జిల్లా జడ్‌పి సెంటర్ వద్ద జరిగిన మహాధర్నాలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయబద్ధంగా అడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తోందని విమర్శించారు. ఫుడ్ కమిషనర్ ప్రతాప్‌రెడ్డి చిరుద్యోగులపై చిన్నచూపు చూస్తూ మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పాల్గని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు చెల్లించకుండా అంగన్‌వాడీ కేంద్రాలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా అంగన్‌వాడీలపై ఒత్తిడి తేవడం తగదన్నారు. రకరకాల యాప్‌లతో పని భారం పెంచారు కానీ, వేతనాలు పెంచడం లేదని విమర్శించారు. ఏలూరు కలెక్టరేట్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, వీటిపై అడుగుతున్న వారిని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి బెదిరిస్తుండడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి కేటాయించే మెనూ ఛార్జీలకు చాక్‌లెట్ కూడా రాదని విమర్శించారు. పిఆర్‌సి అమలు చేస్తామని ప్రభుత్వోద్యోగులను, పర్మినెంట్ చేస్తామని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసగించిందని దుయ్యబట్టారు. అంగన్‌వాడీల పట్ల ముఖ్యమంత్రి వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యలపై వచ్చే శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అంగన్‌వాడీలు భవిష్యత్తులో చేసే పోరాటాలకు కూడా పిడిఎఫ్ ఎంఎల్‌సిలమంతా మద్దతు ఇస్తామని తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, పాడేరు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం కలెక్టరేట్ల వద్ద ధర్నా జరిగింది. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు పాల్గని ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటిడిఎ వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు.
- నిర్బంధం సరికాదు : ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
శాంతియుత నిరసనలపై పోలీసులు నిర్బంధం ప్రయోగించడం తగదని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి బేబిరాణి, కె సుబ్బరావమ్మ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేదని పేర్కొన్నారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
- తక్షణం సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలపై అరెస్టులు, అడ్డుకోవడంలాంటి నిర్బంధాలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం తగదని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.












