Dec 24,2022 21:58
  •  చలిగాలులు, వర్ష సూచన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు యానాంలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, తూర్పు దిశల్లో ఈ చలిగాలులు వీస్తాయని పేర్కొంది. మరో ఒకటి, రెండు రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 25న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకు శనివారం సాయంత్రానికి ట్రింకోమలీ(శ్రీలంక)కి తూర్పు ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నంకు తూర్పుగా 470 కిలోమీటర్లు, చెన్నెకి తూర్పు ఆగేయంగా 500 కిలోమీటర్లు సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ నైరుతి దిశగా పయనించే అవకాశం ఉంది. ఆదివారం ఉదయానికి శ్రీలంక తీరానికి చేరకుని, అక్కడినుండి పశ్చిమ నైరుతీ దిశగా కదులుతూ 26 ఉదయం నాటికి కొమోరిన్‌ పరిసర ప్రాంతాలకు చేరుకుంటుంది.