Sep 21,2022 11:57

బీజింగ్‌ : ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్‌ విధానంలో ఆర్కిటిక్‌ తోడేలును చైనా శాస్త్రవేత్తలు సృష్టించారు. ఆర్కిటిక్‌ తోడేలును సాధారణంగా పోలార్‌ ఉల్ఫ్‌, లేదా వైట్‌ ఉల్ఫ్‌ అని పిలుస్తారు. అంతరించిపోతున్న అరుదైన జీవజాతులను క్లోనింగ్‌ ద్వారా కాపాడటంలో చైనా విజయాన్ని మైలురాయిగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ గ్లోబల్‌ టైమ్స్‌ ట్వీట్‌ చేసింది. ''ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్‌ విధానంలో జన్మించిన ఆర్కిటిక్‌ తోడేలు 100 రోజుల తర్వాత వీడియో ద్వారా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చింది. అంతరించిపోతున్న అరుదైన జాతుల బ్రీడింగ్‌కు దీని పుట్టుకతో క్లోనింగ్‌ ద్వారా మార్గం ఏర్పడింది'' అని పేర్కొంది. దీనిని బీజింగ్‌లోని సినోజీన్‌ బయోటెక్నాలజీ కో సంస్థ ల్యాబ్‌లో క్లోనింగ్‌ చేశారు. జూన్‌ 10వ తేదీన ఈ తోడేలు జన్మించింది. దీనికి 'మాయా' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది ఆరోగ్యంగా ఉంది. మాయా జన్మకు ఉపయోగించిన క్లోనింగ్‌ కణం ఓ ఆర్కిటిక్‌ తోడేలు చర్మం నుంచి సేకరించారు. ఈ ఆడ తోడేలును కెనడా నుంచి హెర్బిన్‌ పోలార్‌ ల్యాండ్‌ సంస్థకు అప్పగించారు. మాయా సరోగేట్‌ తల్లిజీవి బీగిల్‌ జాతి కుక్కగా కంపెనీ తెలిపింది.