
ప్రజాశక్తి-ఒంటిమిట్ట :టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం కలిసి ఈ నెల 31 నాటికి శ్రీ సీతారాముల స్వామివారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి సూచించారు. శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కడప కలెక్టర్ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీసీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ కల్యాణానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, ఇతర సదుపాయాలపై సంబంధిత జిల్లా అధికారులతో పాటు టిటిడిలోని ఆయా విభాగాధిపతులతో కమిటీలు నియమించామన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ గత ఏడాది 3,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ సారి నాలుగు వేల మందిని నియమిస్తున్నామని తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను టిటిడి ఇఒ ఆవిష్కరించారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, జెసి సాయికాంత్‌వర్మ, ఎస్‌విబిసి సిఇఒ షణ్ముఖకుమార్, టిటిడి సిఇ నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.