Nov 28,2022 19:47
  • ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు పుణ్యవతి డిమాండ్‌

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌ బాబా, గరికపాటి నరసింహారావులను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్‌.పుణ్యవతి డిమాండ్‌ చేశారు. హింసకు వ్యతిరేకంగా ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, శ్రామిక మహిళ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ జగదాంబ జంక్షన్‌లో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల పట్ల హింస రోజురోజుకూ పెరుగుతోందని, కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే ఉత్తరప్రదేశ్‌ లాంటి చోట్ల బాధ్యులకు అండగా నిలుస్తూ బాధితులకు క్షోభ మిగులుస్తోందని అన్నారు. స్వామీజీలమని చెప్పుకుంటూ సెలబ్రిటీలుగా దేశంలో చలామణి అవుతున్న కొద్దిమంది.. మహిళల వస్త్రధారణనే ప్రధాన అంశంగా చూపెడుతూ అవమానపరచడం శోచనీయమని పేర్కొన్నారు. ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు, రాందేవ్‌ బాబాలను నిర్భయ, ఈవ్‌ టీజింగ్‌ చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళల పట్ల జరుగుతున్న హింసకు మద్యం, మత్తు పదార్థాలు కారణమవుతున్నాయని తెలిపారు. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. మహిళా చట్టాల అమలులో ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి, డివైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు యుఎస్‌ఎన్‌.రాజు, సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు బి.కుసుమ, ఎల్‌.జె.నాయుడు పాల్గొన్నారు.

aidwa