May 28,2023 06:28

'మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ' అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. సాంకేతిక పురోగతిలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ) ఆవిష్కరణ ఒక గేమ్‌ ఛేంజర్‌. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం జీవించే, పనిచేసే, సంభాషించే విధానాన్ని మార్చింది. స్వీయ డ్రైవింగ్‌ కార్ల నుండి వర్చువల్‌ అసిస్టెంట్ల వరకు, ఏఐ సామర్థ్యం, కచ్చితత్వం- మొత్తం మానవ అనుభవాన్ని మెరుగుపరచడంలో విశేషమైన పురోగతిని సాధించింది. అయినప్పటికీ, కృత్రిమ మేధ యుగాన్ని మరింత లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, దానివల్ల ఎదురయ్యే సమస్యలను పరిశీలించడం చాలా ముఖ్యం. దాని శక్తిని బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించేలా చూడటం మరింత కీలకం. 'టెక్నాలజీ ఉపయోగకరమైన సేవకుడు, కానీ ప్రమాదకరమైన మాస్టర్‌' అంటాడు నార్వే చరిత్రకారుడు క్రిస్టియన్‌ లౌస్‌ లాంగే. మంచి పనులు చేయడానికి ఉపయోగించిన రోబోను... చెడ్డపనులకు ఎలా ఉపయో గించారో 'రోబో' సినిమాలో చూస్తాం. కృత్రిమ మేధ ఎంత పురోగతి సాధించినా... వాటంతట అవి అపకారం చేయలేవు. ఏదైనా మంచిగాని, చెడుగానీ జరిగిందంటే, అది వాటిని సృష్టించిన మనిషి వల్లే.
'మనిషి చేయగల ఏ పని అయినా మెషీన్స్‌ మరో 20ఏళ్లలో చేస్తాయి' అని ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత హెర్బర్ట్‌ సైమన్‌ 1965లోనే అన్నాడు. నేడు మనిషి చేసే అన్ని పనులు యంత్రాలు చేయగలుగుతున్నాయి. విద్య, వాణిజ్యం, వైద్యం, మిలిటరీ, పరిశోధన వంటి రంగాల్లో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇప్పటికే చాలా దేశాల్లో ఎఐ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. రోగనిర్ధారణలో ఏఐ మెరుగైన సేవలు అందిస్తోంది. ముఖ్యంగా వైద్యులకు సహాయం చేయడంలో, మానవ తప్పిదాలను తగ్గించడంతోపాటు కృత్రిమ మేధతో నడిచే రోబోలను శస్త్రచికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే, ఇటీవల ప్రాచుర్యం పొందిన చాట్‌ జీపిటీ వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయోననే ఉత్సుకత ఒకవైపు వున్నా, ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయోననే ఆందోళన కూడా నెలకొంటోంది. ఇప్పటికే సాంకేతిక విజ్ఞానం ప్రభావం ఉద్యోగులపై కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి రంగాల్లో ఏఐ ప్రభావం కచ్చితంగా వుంటుందని నిపుణులు అంటు న్నారు. అయితే, 'కృత్రిమ మేధస్సు మానవాళికి ముప్పు కాదు. ఇది మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించ డానికి, మానవ జీవితాలను మెరుగుపర్చడానికి మేము రూపొందిస్తున్న సాధనం' అంటారు అమెరికన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఫే ఫే లి. అదే సమయంలో ఏఐ వల్ల గోప్యత, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఆందోళనక రంగా మారింది. గోప్యతను పరిరక్షించడం, డేటా రక్షణను నిర్ధారించడం చాలా కీలకం. ఏఐ శక్తిని ఉపయోగించుకోవడం- వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించుకోవడం మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం.
'పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి మానవ జాతి అంతానికి దారితీస్తుంది' అంటాడు స్టీఫెన్‌ హాకింగ్‌. వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాలను పెంచుకునేందుకు వీలు కల్పించేలా ఉత్పత్తి ప్రక్రియలో శారీరక, మానసిక శ్రమను తొలగించేందుకు ఒక సాధనంగా కృత్రిమ మేధస్సు రూపొందించబడింది. ఇది శ్రామికులను భారీగా తగ్గిస్తుంది. దోపిడీని తీవ్రతరం చేస్తుంది. ఇటీవలి కాలంలో దీని వేగం, విస్తరణ... ఇదివరకెన్నడూ ఊహించని రంగాలపై కూడా ప్రభావం చూపుతోంది. దీన్ని అదుపు చేయడానికి ఒక అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం వుంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై కనిపిస్తున్నది. 'ఏఐ అగ్ని లాంటింది. ఇది చాలా ఉపయోగకరంగా వుంటుంది. కానీ, మనం జాగ్రత్తగా వుండాలి' అంటాడు ట్విటర్‌ అధినేత అలెన్‌ మస్క్‌. ఏఐ అపరిమితమైన అవకాశాలతో కొత్త శకానికి నాంది పలికినమాట వాస్తవం. అయితే, దీనివల్ల ఎదురయ్యే సవాళ్లను సవ్యంగా పరిష్కరించడం అవసరం. సమాజ శ్రేయస్సును నిర్ధారించేటప్పుడు కృత్రిమ మేధస్సు యొక్క సామర్థ్యాన్ని పెంచడంలోని సృజనాత్మకత - నైతికత మధ్య సమతుల్యతను సాధించడం కీలకం. నైతికతను పాటించడం ద్వారా, మానవాళికి ప్రయోజనం చేకూర్చే కృత్రిమ మేధ ఆధారిత భవిష్యత్తుకు మార్గం సుగమం చేయవచ్చు.