Sep 18,2023 07:30

          ప్రముఖ రచయిత్రి శ్రీమతి జ్వలిత (విజయ కుమారి) సంపాదకత్వంలో వెలువడిన 'మల్లెసాల' శతాధిక చేతి వృత్తి కథల సంకలనం. ఈ అమూల్య సంకలనాన్ని చేతి వత్తులను నమ్మి అశువులు బాసిన కుటుంబాలకు వివక్షకు గురవుతున్న కుటుంబాలకు 'మల్లెసాల'ను అంకితమిచ్చారు సంపాదకురాలు.
         నూటా ముప్పైకి పైగా చేతి వృత్తులకు సంబంధించిన వేదనా సంవేదనల మిళితమే ఈ సజీవగాధలతో కూడిన సంకలనం. వెయ్యికి పైగా పేజీలను పొందుపరచుకొని, కనీవినీ ఎరుగని చారిత్రక, పరిశోధనాత్మక బహత్‌ గ్రంధమే మల్లెసాల. దేశంలో ప్రవేశ పెట్టబడిన పారిశ్రామికీకరణ వల్ల కులవృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితికి సంపూర్ణంగా చిత్రీకరించాయి ఇందులోని కథలు.
         మల్లెసాల పేరు మనల్ని బాగా ఆకర్షిస్తుంది. దాదాపుగా వాడుకలో లేని పదానికి తిరిగి జీవం పొయ్యడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం.'మల్లెసాల' అంటే.. వృత్తికి సంబంధించిన పనిముట్లను, పరికరాలను ఉంచే ఒక అర్ర, ఒక గది, దాన్నే సాయమాను అని కూడా అంటారు.
ప్రాచీన హిందూ సమాజం అగ్రవర్ణ మనువాద బ్రాహ్మణులు ఏర్పరచిన నిచ్చెన మెట్లతో కూడిన చతుర్వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణేతర వృత్తిపనులు చేస్తూ సేవలందించే వారిని శూద్రులుగా, బహిష్క ృతులుగా పేర్కొంటూ కిందిమెట్టుపై ఉంచి వివక్షతో చూసిన కాలమది. ఈ అట్టడుగున ఉన్న శూద్రుల, చేతివృత్తులు క్రమక్రమంగా కులాలుగా పరిణామం చెందాయి. ఈ కులవృత్తులనే చేతివృత్తులు అనీ, ఆ పనులను నిర్వహించే వీరినే బహుజనులు అని వ్యవహరించడం కూడా అమలుల్లో ఉంది.
           19వ శతాబ్దపు ఆరంభంలో చోటు చేసుకున్న పారిశ్రామికీకరణ, తద్వారా వచ్చిన ప్రపంచీకరణ నేపథ్యం కులవృత్తుల్లో పెను మార్పులు సంభవించాయి. ఫలితంగా చేతివృత్తులు తీవ్రంగా దెబ్బతిని ఊహించని విధంగా వృత్తుల విధ్వంసం, వెనువెంటే ఊహించని విషాదం జరిగింది. ఆ పనుల్లో చోటు చేసుకున్న వివిధ పరిణామాలను, అందులోని వేదనలను, ఆ సమస్యల తాలూకూ పరిష్కారాలను ప్రతిబింబిస్తూ అక్షరీకరించిన సమగ్ర గ్రంథమే మల్లెసాల.
           గతంలో వృత్తులపై వచ్చిన కథా సంకలనాలకు భిన్నంగా జ్వలిత ఈ సంకలనాన్ని తీసుకు రావడం అభినందనీయం. చేతి వృత్తులు పతనమవుతున్న తీరు .వారి జీవన పోరాటాలను చిత్రీకరిస్తూ రాసిన కథలు ఎంపిక చేసి ఈ సంకలనంలో పొందుపరిచి దీన్ని అమూల్య గ్రంధంగా తీర్చిదిద్దారు. దళితులు వాటి ఆశ్రిత జాతులు, సంచార కులాలు, బీసి ఆశ్రిత కులాలపై వచ్చిన కథలు ఇందులో వాస్తవిక వర్ణనలో చోటు చేసుకోవడం ఓ ప్రత్యేకం. ఇప్పటివరకూ చేతివృత్తులమీద వచ్చిన వాటిల్లో ఇది ఏకైక సమగ్ర సంకలనంగా చెప్పొచ్చు. వందకు పైగా ఉన్న ఈ కథల్లో ఇంచుమించు అన్ని వృత్తులను రచయితలు స్పృశించారు, వారి కథల్లో సమస్యలతో పాటు కొత్త కొత్త పరిష్కారాలను చూపించారు. దీని కన్నా ముందు కొన్ని వృత్తి కథల సంకలనాలు విడివిడిగా వచ్చాయి గాని, అన్ని వృత్తులకు సంబంధించిన కథల పుస్తకం మాత్రం ఈ మల్లెసాలనే మొదటిది.
           ఈ గ్రంథంలోని 139 కథల్లో 13 చేనేత కథలు, 8 చేపలు పట్టే వత్తి కథలు, నాలుగు గొర్రెల పెంపకం వారి కథలు, రెండు ఎరుకల కథలు ఉన్నాయి. ఇంకా కుమ్మరి కథలు నాలుగు, మంగలి వృత్తివి ఐదు, పాకీ పని వారివి మూడు, వడ్రంగి వారివి ఎనిమిది, చాకలి వృత్తివి ఏడు, చెప్పుల తయారీ వారి కథలు ఆరు, కుట్టుపని నాలుగు, కాటికాపరివి రెండు, దొమ్మరి ఒకటి, యక్షగానం రెండు, బొమ్మలు చేయడం, సైకిల్‌ రిపేర్‌, పూలు అల్లడం, భవన నిర్మాణం, బంజారా కుట్టుపని, సాధనాసురులు, వ్యవసాయం, పశువుల పెంపకం, సున్నం బట్టీలు, పెయింటింగ్‌ పని, గానుగాడించే పని, సన్నాయి వాయించే పని, బీడీలు చుట్టేలాంటి పనులు ఇంకా ఎన్నో కథలు దీంట్లో పొందుపరచబడ్డాయి. స్త్రీవాద కోణంలోంచి చాలా కథలు ఉన్నప్పటికీ రెండు కథలు మాత్రం ప్రత్యక్షంగా స్త్రీల సమస్యలను ప్రస్తావించేవే !
           ఈ మొత్తం కథకులలో 88 మంది రచయితలు, 51 మంది రచయిత్రులు. లబ్ద ప్రతిష్టుల నుంచీ వర్ధమానుల దాకా ఉన్నారు. ఇందులో కథకుల సంక్షిప్త సమాచారం, ప్రస్తావించిన కథ ఏ వృత్తికి సంబంధించిందో అనే కొన్ని వివరాలతో పొందుపరచబడి ఉన్నందువల్ల కథకుల గురించి వారి ఇతర కథల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దీంట్లోనే కథలన్నీ సమస్యలను చూపిస్తూ సందేశాత్మకమై చదువరులను తమ వైపు తిప్పుకునేలా ఉన్నాయి.
         మేదరి కుటుంబానికి చెందిన 'సఫాయి' కథగానీ, కంసాలి వృత్తి నేపథ్యంలో వచ్చిన కథలు గానీ హృద్యంగా సాగాయి. అవి చదువుతుంటే ఒళ్ళు గగుర్పాటుతో కన్నీళ్లు వస్తుంటాయి.
         బతుకుతెరువు కోసం బకెట్టు, చీపురు, రేకు పట్టుకుని ఇంటింటికి తిరిగి మలాన్ని ఎత్తిపోసే కుటుంబం అది. పదవ తరగతి చదువుతున్న వాళ్ళ కొడుకు తండ్రిని మలం గుంటల వ్యర్ధాలను ఎత్తిపోయడానికి వీల్లేదని పంతం పట్టడం ఈ కథలో చూస్తాం. పాయిఖానా వ్యర్ధాలను తోడటానికి ట్యాంకర్‌, వాక్యూమ్‌ మిషిన్‌ రావడం తండ్రిని ఆ పని నుండి తప్పించే ప్రత్యామ్నాయంగా ఆ పిల్లవానికి ఆనందదాయకం. కానీ తండ్రి ఉపాధి కోల్పోయి విలపిస్తూ రోడ్డున పడటమే సఫాయి కథ.
            ఆదిమకాలంలో మట్టి పాత్రలను తయారు చేయడంలో, ఆ తరువాత కాలంలో వేటలో, వ్యవసాయంలో సహకరించి ముందు నడిచిన స్త్రీ.. ఆ తర్వాతి కాలంలో ఆమె ఉనికి కరువై, కనుమరుగైందని స్త్రీ జాతి చేసిన వృత్తులను మగవాడు ఆక్రమించేసి ఆమెను వంటకు, ఇంటి పనికి, పిల్లలను కనడానికి పరిమితం చేసి ఏ వృత్తి మీద స్త్రీ పేరు లేకుండా చేసిందని 'ఆకుపేషన్‌' కథలో రచయిత్రి ఆవేదన. 'కాలాలు మారేనా' కథలో చాకలి వృత్తికి సంబంధించిన ఓ చదువుకున్న అమ్మాయి అంతకుముందు భర్త చనిపోయినప్పుడు దగ్గరుండి చేసే వైధవ్యానికి సంబంధించిన సామాజిక దురాచారాలను సంస్కరించి వాటిని జరగకుండా నడిపించే కథ ఔరా.. నిజమే కదా అనిపించక మానదు.
నిరంతరము అనంతము, ఐరేని కుండలు, మంగుళం పెంక మొదలైన కుమ్మరి జీవితాలకు సంబంధించిన కథలూ ఉన్నాయి, ప్రపంచీకరణ తర్వాత బాగా నష్టపోయి రోడ్డున పడ్డ వృత్తి కుమ్మరి వారిదే. వారు బతుకుదెరువు కోసం ప్లంబర్లుగా మారిన వైనాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ముస్లిం జీవితాల్లోని వృత్తి కథలూ వారి జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులు చివరకు మెకానిక్‌గా మారిన వారి జీవన దుర్భర స్థితులను ఆర్ద్రంగా చూపెట్టాయి.
            సాంకేతిక పరిజ్ఞానమూ, యంత్రాలు పెరిగిన కారణంగా బతుకుదెరువు అదృశ్యమై వృత్తికారులు ముఖ్యంగా కార్పెంటరి వాళ్లు అడ్డ మీద దినసరి కూలీలుగా మారిన విధానం 'పెద్ద బాడిస', 'అన్నం గుడ్డ' కథల్లో చిత్రించారు. కట్టెకోత మిషన్లు వచ్చి వడ్రంగుల జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. పనులు దొరక్క వలస వెళ్లవలసి వచ్చిన వీరి దైన్యాన్ని ఈ కథలు తెలియజేస్తున్నాయి. పద్మశాలి వృత్తి కథలు, వారిని ఆశ్రయించుకొని జీవితాలను వెల్లదీసే సాధనాసురుల ఇంద్రజాల ప్రదర్శనలు, వీరి జీవితాల్లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని చిత్రిక పట్టాయి. వృత్తుల విధ్వంసాన్ని చూపిన ఈ కథలన్నీ మనలను విస్మయానికి గురిచేస్తాయి.
          ఈ సంకలనం ద్వారా భిన్న వృత్తులలో జీవిస్తున్న వివిధ రకాల మనుషుల ఆకాంక్షలను, ఆరాట పోరాటాలను ప్రతిబింభిస్తున్నాయి. ఇవన్నీ విశాలము, వైవిద్య భరితమూ అయి మానవ జీవితాల్లోని సంవేదనలని ఏకకాలంలో కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ఆ క్రమంలోనే ప్రతి వృత్తి లోతుపాతులు, అవి ఎలా ఏర్పడ్డాయి, ఏ ప్రయోజనానికి సృష్టించబడ్డాయి? అప్పటి సమాజంలో వాటి ఆవశ్యకత, నేడవి ఏవిధంగా అంతరించిపోతున్నాయి అనే విషయాలు స్పష్టమవుతున్నాయి.
             మారిన సామాజిక, సాంస్క ృతిక పరిస్థితుల దృష్ట్యా బహుజనుల కర్తవ్యం చదువు నేర్చుకుని విద్య, ఉద్యోగాల్లో ఉపాధిని వెతుక్కొని, వారి వారి సృజనలను మెరుగు పరచుకోవాలనే సందేశాన్ని అందిస్తున్నాయి. వంశపారంపర్యం గా రాకున్నా, నేడు ఉపయోగపడే ఇతరత్రా నైపుణ్యాలను నేర్చుకుని, అలవరచుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకోవల్సిన ఆవశ్యకత ఈ సంకలనం తెలియజేస్తుంది. వృత్తి పనులకు సంబంధించిన ముఖచిత్రం ఈ గ్రంథానికి మరింత ఆకర్షణ. ఈ మల్లెసాల వృత్తిపనులకు సంబంధించి ఒక విజ్ఞాన సర్వస్వం. పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే సామాజిక చారిత్రక గ్రంథం. సంపాదకురాలు జ్వలిత 2016లో 104 మంది రచయితలతో ఖమ్మం కథలు వెలువరించారు. 139 కథలతో అద్భుతంగా ఈ మల్లెసాలను తేవటం సాహితీ జగత్తుకు నిజంగానే చాలా ఉపయుక్తం. రూ.1200 విలువైన ఈ పుస్తకం ప్రతులకు 99891 98943 నెంబర్లో సంపాదకులు జ్వలితను సంప్రదించవొచ్చు.
 

- డాక్టర్‌ కటుకోఝ్వల రమేష్‌
99490 83327