Mar 21,2023 16:34
  •  సమస్యలు పరిష్కరించాలని డిఎంఅండ్‌హెచ్‌ఓ వద్ద ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : కనీస వేతనం చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం డిఎంఅండ్‌హెచ్‌ఒ, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వైద్యాధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఆశాలు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున నినదించారు. అధికారులు స్పందించకపోవడంతో ఆశాలు, సిఐటియు నేతలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశా కార్యకర్తలంతా అక్కడే బైఠాయించారు. దీంతో జిల్లా అదనపు వైద్యఆరోగ్యశాఖాధికారి భానునాయక్‌ ధర్నా వద్దకు చేరుకుని ఆశాలతో మాట్లాడారు. వారం రోజుల్లో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వేసి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సదర్భంగా ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి లారెన్స్‌కుమారి స్పృహ కోల్పోయారు. దీంతో యూనియన్‌ నేతలు చికిత్స నిమిత్తం ఆమెను భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరుపతి డిఎంహెచ్‌ఒ కార్యాలయం వద్ద ధర్నాలో సిఐటియు రాష్ట్ర నాయకురాలు ఆర్‌.లక్ష్మి మాట్లాడారు. అనంతరం డిఎంహెచ్‌ఒ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు. నంద్యాల సిఐటియు కార్యాలయం నుంచి డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎంఅండ్‌హెచ్‌ఒ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. కర్నూలులో డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం డిఎంఅండ్‌హెచ్‌ఒ రామగిడ్డయ్యకు వినతి పత్రం సమర్పించారు. నెల్లూరు నగరంలోని ములుమూడు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటిడిఎ కార్యాలయం ఎదుట, చింతూరులో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయం వద్ద ఆందోళనలు చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద, కృష్ణా, విజయనగరం; శ్రీకాకుళం జిల్లాల్లో డిఎంహెచ్‌ఒ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. అనంతరం వైద్యాధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

1

 

2

 

3

 

4

 

5