
గువహటి : తమ ప్రభుత్వంలో తదుపరిగా మరో మంత్రి మనీశ్ సిసోడియాను మోడీ సర్కార్ లక్ష్యంగా చేసుకోబోతున్నదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు వాస్తవయ్యేటట్లు కనిపిస్తున్నాయి. ఆప్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ భార్య రునికి భూయాన్ శర్మ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కరోనా సమయంలో హిమంత ఆసోం ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించగా.. పిపిఇ కిట్ల కాంట్రాక్టులు ఆయన భార్యకు కేటాయించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మనీశ్ సిసోడియా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆమె కామ్‌రూప్ (మెట్రో) సివిల్ జడ్జ్ కోర్టులో దావా వేసినట్లు ఆమె తరుపు న్యాయవాది పద్మాధర్ నాయక్ తెలిపారు. సిసోడియా ఉద్దేశపూర్వకంగా తన క్లయింట్ రినికి భూయాన్‌పై ఆరోపణలు చేశారని, ఇందులో వాస్తవం లేదని చెప్పారు.
ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించిన మనీష్ సిసోడియా.. ఓ మీడియా నివేదికను ప్రస్తావిస్తూ.. హిమంత భార్య రినికి, ఆయన కుమారుడు.. వ్యాపార భాగస్వామ్యులకు పిపిఇ కిట్ల కాంట్రాక్టులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్కో కిట్‌ను ఓ సంస్థకు రూ.600 చొప్పున ఇచ్చి.. హిమంత తన భార్య, కుమారుడికి చెందిన కంపెనీలకు ఒక్కొక్కటి రూ.990 ఖర్చు చేసి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకే దాతఅత్వం పేరుతో 1500 పిపిఇ కిట్లను పంపిణీ చేశారని సిసోడియా విమర్శించారు.
అయితే ఈ ఆరోపణలపై రినికి భుయాన్ స్పందిస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్న తొలి వారంలో అసోంలో ఒక్క పిపిఇ కిట్ కూడా లేదని, ఈ విషయమై ఒక వ్యాపారిని సంప్రదించి 1500 పిపిఇ కిట్లను ఉచితంగా అందించానని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కిట్లను పంపిణీ చేసినట్లు చెప్పిన ఆమె.. మనీశ్ సిసోడియాపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. కాగా, పిపిఇ కిట్ల స్కాంలో రినికి శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆప్ గౌహతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి : మమ్మల్నందర్ని ఒకేసారి జైలులో పెట్టండి.. మోడీకి కేజ్రీవాల్ వినతి