
- ప్రజాశక్తి 42వ వార్షికోత్సవ సభలో వక్తలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి :ఒక వైపు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుండగా మరో వైపు పాలక బిజెపి దాడుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అగత్యం ఏర్పడటం ఆందోళనకరమని వక్తలు చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాశక్తి దినపత్రిక 42వ వార్షికోత్సవ సభ శుక్రవారం ఎంబివికె ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్ అధ్యక్షత వహించారు. సభకు హాజరు కాలేకపోయిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రజాశక్తి అభివృద్ధిని కాంక్షిస్తూ సందేశం పంపారు. ముఖ్య అతిథి కేరళ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పి రాజీవ్ ఆన్‌లైన్‌లో సభనుద్దేశించి ప్రసంగించారు. బిజెపి పాలనలో ఒక పథకం ప్రకారం సైద్ధాంతికంగా రాజ్యాంగ మూలాలు, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం కొనసాగుతోందన్నారు. రాజ్యాంగానికి మూడు మూల స్తంభాలుగా ఉన్న శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు బీటలు వారుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఉన్నా ఎంపిలు గొంతెత్తేందుకు ఆస్కారం లేదని, జ్యుడీషియరీ సైతం ఈ కాలంలో కార్యనిర్వాహక తరహాలో మారిపోతోందన్నారు. నాల్గవ స్తంభంగా పని చేయాల్సిన ప్రెస్, మీడియా సైతం ఎగ్జిక్యూటివ్‌గా మారిందన్నారు. ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు అత్యంత ప్రమాదకరమన్నారు. 'రాజ్యాంగ నిర్ణాయక సభలో పత్రికా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇవ్వాలని ఉన్న ఒకే ఒక్క కమ్యూనిస్టు సభ్యుడు సోమనాథ్ లాహిరి ఎలుగెత్తారు. మొదటి నుంచీ పత్రికా స్వేచ్ఛను కాంక్షించింది కమ్యూనిస్టులే'నన్నారు. 'రాజ్యాంగంలోని ఒకటవ ఆర్టికల్‌లో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఫెడరలిజానికి తూట్లు పొడుస్తూ గవర్నర్లను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో సూపర్ కేబినెట్‌లుగా మార్చేసింది. రాజ్యాంగ అసెంబ్లీలో గవర్నర్ల అధికారాలపై చర్చ సందర్భంగా అంబేద్కర్ తన ముగింపు సమాధానంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు, తనకు తానుగా నిర్వహించే విధులు ఏమీ లేవు. కేవలం అలంకారప్రాయమేనన్నార'ని గుర్తు చేశారు. రాజ్యాంగం రూపుదిద్దుకునే నాటికే లౌకికవాదం, మతతత్వం మధ్య పోరాటం నడిచిందని, రాజ్యాంగ పీఠికలో 'భగవంతుడి'ని చేర్చాలన్న ప్రతిపాదనపై ఓటింగ్ జరగ్గా 68-41 ఓట్ల తేడాతో సెక్యులరిజం గెలిచిందని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజాశక్తి ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. 'దేశాభిమాని' పత్రికకు ఎడిటర్‌గా ఉన్న సమయంలో ప్రజాశక్తి నాయకత్వంతో తనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. వరదలు, వర్షాల కారణంగా సహాయ పునరావాస చర్యల సమన్వయం బాధ్యతల వలన భౌతికంగా సభకు హాజరు కాలేకపోయానని తెలిపారు.
విలువలతో కూడిన జర్నలిజం
జర్నలిజంలో విలువలు పాటించే ప్రజాశక్తి వంటి సంస్థలు ఉన్నందువల్లనే నేటికీ పత్రికలకు ఆదరణ లభిస్తోందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజాశక్తి 42వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాశక్తి విలువలతో కూడిన వార్తలు రాయాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్ మాట్లాడుతూ 1981లో దినపత్రికగా అవతరించిన ప్రజాశక్తి 'ప్రతి అక్షరం-ప్రజల పక్షం' లక్ష్యంగా అకుంఠిత దీక్షబూని కృషి చేస్తోందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, తదితర మహనీయుల చొరవే పత్రికకు పునాది అని, ఆ స్పూర్తే నాడు, నేడు, రేపు ప్రజాశక్తిని నడిపిస్తుందని చెప్పారు. మతోన్మాదం, సరళీకరణ, ప్రపంచబ్యాంక్ విధానాలు.. ఇలా ప్రజాశక్తి ఎల్లప్పుడూ ప్రజా ఉద్యమాలకు ప్రచార, ఆందోళన సాధనంగా నిలిచిందన్నారు. ప్రజలు, ప్రకటన కర్తలు, శ్రేయోభిలాషుల ఆదరణ, సహకారంతో ప్రజాశక్తి అభివృద్ధి, విస్తరణ సాధ్యమైందన్నారు.
మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలి
పత్రికలు, మీడియా స్వతంత్రంగా పని చేయాలని ఎంఎల్‌సి కెఎస్ లక్ష్మణరావు అన్నారు. జాతీయోద్యమ కాలంలో వచ్చిన కొన్ని పత్రికలు స్వాతంత్య్ర కాంక్షను ప్రజల్లో రగిలించాయని, కమ్యూనిస్టు పత్రికలు ప్రజలందరికీ సంపూర్ణ స్వరాజ్యం నినాదంతో పని చేశాయని చెప్పారు. తొలి రోజుల్లో స్వతంత్రంగా పని చేసిన పత్రికలు, 1991 తర్వాత కార్పొరేటీకరణయ్యాయన్నారు. ప్రస్తుతం యాజమాన్యాల ఆలోచనలకనుగుణంగా మీడియా నడుస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి వచ్చాక ఫెడరలిజం, సెక్యులరిజం, పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం యథేచ్ఛగా సాగుతోందన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, వారి గొంతుకై ప్రజాశక్తి పని చేయాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ాబిజెపి సిద్ధాంతాన్ని ప్రజలు తప్పక ఓడిస్తారన్నారు.
ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
42వ వార్షికోత్సవ సంచికను మేయర్ భాగ్యలక్ష్మి, స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, నిజమైన త్యాగాలు, ద్రోహాలపై వాస్తవాలు వెల్లడిస్తూ ప్రజాశక్తి ప్రచురించిన బుక్‌లెట్స్‌ను ఎంఎల్‌సి లక్ష్మణరావు ఆవిష్కరించారు. తొలుత ప్రజాశక్తి ప్రస్థానంపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ప్రజాశక్తి చీఫ్ జనరల్ మేనేజర్ వై అచ్యుతరావు, బుకహేౌస్ ఎడిటర్ ఎస్ వెంకట్రావు, సబ్ కమిటీ సభ్యులు హరికిషోర్ తదితరులు పాల్గన్నారు. జనరల్ మేనేజర్ తిరుపాల్‌రెడ్డి అతిథులను వేదికపైకి ఆహ్వానించగా, అసిస్టెంట్ ఎడిటర్ కె గడ్డెన్న వందన సమర్పణ చేశారు. నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్, సిజిఎం పి ప్రభాకర్ సందేశం పంపారు.