
- పిఎల్‌ఐ లోపాలే కారణం
న్యూఢిల్లీ : భారత్‌లో ఉత్పత్తి అవుతోన్న మొబైల్ ఫోన్లు అన్నీ అసెంబ్లింగ్ ద్వారా తయారు చేస్తున్నవేనని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. దేశంలో నిజమైన తయారీ కంటే అసెంబ్లింగ్ ద్వారానే ప్రధానంగా ఉత్పత్తి జరుగుతుందని రాజన్ ఓ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఇందుకు దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ (పిఎల్‌ఐ) పథకం లోపాలే కారణమని విమర్శించారు. ''దేశంలో ఫోన్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సబ్సిడీ చెల్లించబడుతుంది. తయారీ ద్వారా ఎంత విలువ జోడించబడుతుందనే దానిపై కాదు. ఫోన్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. దీంతో నికర ఎగుమతుల్లో పెరుగుదల కష్టం.'' అని రాజన్ పేర్కొన్నారు. పిఎల్‌ఐ పథకం అర్హత కలిగిన కంపెనీలకు భారత్‌లో తయారు చేయబడిన వస్తువుల అమ్మకాలపై తొలి ఏడాది 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.