Jan 31,2023 20:12

ప్రజాశక్తి - దెందులూరు (ఏలూరు జిల్లా) : అసైన్డ్‌, సీలింగ్‌, గయాళ భూములను తమకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడులోని వివాదాస్పద చేపల చెరువుల వద్ద పేదలు మంగళవారం ధర్నా చేశారు. పేదల భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నానుద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ.. పేదలకు చెందిన భూములను అక్రమంగా అనుభవిస్తోన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ పేదలకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. దోసపాడులో గత ఎనిమిది నెలలుగా గ్రామానికి చెందిన దళితులు, పేదలు తమ భూములు తమకే ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక తహశీల్దార్‌ అవినీతికి పాల్పడుతూ పేదలకు భూములను పంపిణీ చేయకుండా భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. సర్వే చేస్తామని ఎనిమిది నెలల క్రితం చెప్పి నేటికీ చేయకపోవడం శోచనీయమన్నారు. దళితుల అసైన్డ్‌ భూములను విజయవాడకు చెందిన దేవినేని బాజీప్రసాద్‌, తదితరులు బలవంతంగా ఆక్రమించి దర్జాగా అనుభవిస్తున్నారని తెలిపారు. లోకాయుక్త ఆదేశాలను సైతం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. దళితులు,పేదల భూములను ఆక్రమించుకున్న వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.ఆనందరావు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.