
చలికాలం వచ్చిందంటే చాలు, ఆస్తమా ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడతారు. చలిగాలితో ఊపిరి పీల్చేకునేందుకు భయపడతారు. అందుకు వాయు నాళాల సమస్యే కారణం. ఆహారంతో పాటు, కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఆస్తమా వ్యాధిగ్రస్తులు ధూమపానానికి దూరంగా ఉండాలి. దుమ్మూధూళి ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలను తీసుకోకూడదు. సాధారణంగా నడవ గలిగే వేగంతోనే క్రమం తప్పకుండా నడుస్తూ ఉండాలి.
మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు దోహదపడతాయి. గాలిలో ఉన్న తేమను గ్రహించడం వల్ల కండరాలు బిగుసుకుపోవడం, వాయడం జరుగుతాయి. దాంతో వాయునాళాలు సన్నబడతాయి. దీనివల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఆస్తమా కిందకే వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు మందులు వున్నప్పటికీ ఆహారంలోనూ కొన్ని మార్పులు అవసరం.
ఉల్లిపాయ : దీనిలో యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ ఆస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడం వల్ల 'హిస్తమిన్' విడుదలను అడ్డుకుంటుంది. శ్వాసకోశ వ్యాధిని తగ్గిస్తుంది.
'సి' విటమిన్ : కమలాలు, నారింజ, నిమ్మలో ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోధనలు చెపుతున్నాయి. చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు బాగా తగ్గుతాయని నిపుణుల మాట. రెడ్ క్యాప్సికంలో 'స'ి విటమిన్ ఎక్కువ. కఫం తగ్గించడంలో బాగా దోహదపడుతుంది. కనుక దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
యాపిల్ : దీనిలో ఉండే 'ఫైటో కెమికల్స్' ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో 'లైకోఫిన్' ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటి-ఆక్సిడెంట్‌గా ఆస్త్మా రోగులకు మేలు చేస్తుంది.
పాలకూర : ఆస్తమా ఉన్నవారికి రక్తంలోనూ, రక్తనాళాల్లోనూ మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. పాలకూర ద్వారా మెగ్నీషియం పెంచుకోవొచ్చు. తరచూ పాలకూర తినడం వల్ల ఆస్త్మా లక్షణాలు తగ్గుతాయి.
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సూర్యకిరణాల నుంచి లభించే విటమిన్ డి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. చికాకును తగ్గించుకోవచ్చు. ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను వదులు అయ్యేలా చేస్తాయి. ఆస్తమా బాధితులు ఇన్‌హేలర్‌ను ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలి.