Sep 22,2022 13:50

కొచ్చి : మొబైల్‌ ఫోన్ల వల్ల యూత్‌, చిన్నారులు పెడధోరణులు పడుతున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే, ప్రతిదానికీ రెండోవైపు కూడా వుంటుంది. ఆ మొబైల్‌ ఫోన్లను విజ్ఞాన సముపార్జనకు వాడుకునే వారూ వున్నారు. అందుకు తాజా నిదర్శనమే ఈ సంఘటన. మొబైల్‌ ఫోన్‌ని సద్వినియోగం చేసుకుని ఓ రైల్వే కూలీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యాడు. చదువుకునేందుకు పుస్తకాలు, డబ్బులు లేకపోయినా... అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా... పట్టుదలతో ఏ చిన్న అవకాశాన్నీ విడువకుండా ప్రయత్నించాడు. ఇప్పుడా వ్యక్తి ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించాడు కేరళకు చెందిన శ్రీనాథ్‌.కె. రైల్వే కూలీగా మొదలైన ఆయన ప్రస్థానం... తన లక్ష్యసాధనకు చేసిన కృషి తెలుసుకుందాం...

జీవనం కోసం రైల్వే కూలీ
శ్రీనాథ్‌.కె మున్నార్‌ నివాసి. ఆయనది మధ్యతరగతి కుటుంబం. జీవనం కోసం కేరళలోని ఎర్నాకుళం రైల్వేస్టేషన్‌లో కూలీగా పనిచేసేవాడు. అతని కూలి డబ్బులే.. తన కుటుంబానికి జీవనాధారం. రైల్వేకూలీగా వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదని ఆయన గ్రహించాడు. ఇక ఇంట్లో సంవత్సరం వయసున్న తన కుమార్తె కళ్లెదుట కనిపించింది. తాను పడే ఆర్థిక కష్టాలు తన కుమార్తె పడకూడదని.. కుమార్తెని బాగా చదివించాలని శ్రీనాథ్‌ కలలు కన్నాడు. అందుకు తగట్టే అతను కష్టపడడం ప్రారంభించాడు. అతని రోజువారీ కూలీ 400-500 రూపాయలు. ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పెంచుకోవాలని నైట్‌ షిఫ్ట్‌ల్లో కూడా పనిచేసేవాడు. రోజుమొత్తం కష్టపడినా.. కుటుంబం గడవడం కష్టంగా వుండేది. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించగలిగితే కుమార్తెకి మంచి భవిష్యత్తునివ్వగలననుకున్నాడు. ఆ క్రమంలో మొలకెత్తిన ఓ ఆలోచన ఆతని జీవితాన్నే మార్చేసింది. ఎంతో కష్టమైనా సివిల్స్‌కి ప్రిపేరవ్వాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయమైతే తీసుకున్నాడు కానీ, ఎలా చదువుకోవాలి? అన్న ప్రశ్న చిక్కుముడిగా మారింది. పని మానుకుని చదవడం సాధ్యపడదు. బయట ట్యూషన్స్‌కి వెళ్లడమూ సాధ్యమయ్యే పని కాదు. పుస్తకాలు కొనుక్కోని చదువుకోవాలన్నా.. అంత డబ్బు సర్దుబాటవడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి అతను తెలుసుకున్నాడు. కేరళ ప్రభుత్వం 2016 నుంచి ఉచిత వైఫైని అందిస్తోంది. వైఫై సహాయంతో తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయొచ్చనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యుపిఎస్‌సి ప్రిపర్‌ అవడం ప్రారంభించాడు. ఇలా నాలుగుసార్లు ప్రయత్నించి.. ఉత్తీర్ణుడై.. సివిల్‌ సర్వీసెస్‌ అధికారి అయ్యాడు.

kerala 1


కాగా, ఈ విజయంపై శ్రీనాథ్‌ని పలకరించగా ఆయన మాట్లాడుతూ.. 'నేను సివిల్స్‌ రాయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా దగ్గర డబ్బు లేదు. అయినాసరే నా లక్ష్యాన్ని వదులుకోవాలనుకోలేదు. నా దగ్గర ఉన్న డబ్బులతో.. పాఠ్యాంశాలను వినడానికి ఇయర్‌ఫోన్‌, మెమరీకార్డ్‌, సిమ్‌కార్డ్‌, ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కొన్నాను. నేను రోజూ పనిచేసుకుంటూనే పాఠాలు వినేవాడిని. నా తోటి మిత్రులు నా పక్కనే మాట్లాడుకుంటున్నా.. నేను మాత్రం ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని లెసెన్స్‌ని విన్నాను. నాలుగుసార్లు యుపిఎస్‌సి ఎగ్జామ్స్‌ రాశాను. నాలుగో ప్రయత్నంలో కెపిఎస్‌సి (కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌) రాసి విజయం సాధించాను. పబ్లిక్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించడం ఎంతో ఆనందంగా ఉంది' అని ఆయన అన్నారు. ఇక శ్రీనాథ్‌ ఐఏఎస్‌ అయినందుకు ఆ ఊరి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆయన తన కుటుంబమే కాదు..తన గ్రామస్తులందరి కుటుంబ పరిస్థితి బాగుండాలని శ్రీనాథ్‌ కోరుకుంటున్నాడు.
మొబైల్‌ ఫోన్ల వాడకం వల్ల చిన్నారుల భవిష్యత్తుపై భయాందోళనలు ఒకవైపు.. మరోవైపు స్మార్ట్‌ఫోన్లను సరైన విధంగా ఉపయోగించుకుని జీవితాన్ని మలుపుతిప్పుకునే శ్రీనాథ్‌లాంటి యువకులు మరోవైపు. ఏదిఏమైనా ఓ చిన్న ఆలోచన ఒక జీవితాన్ని మార్చేసింది. కష్టమైన సివిల్స్‌ను ఇష్టపడి చదివి... ఎగ్జామ్స్‌ రాసి విజయం సాధించిన శ్రీనాథ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుదాం.

kerala 6