Jul 01,2022 22:25

-దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు
-శాంతియుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి
-అరాచకాన్ని సృష్టించేందుకే ఈ దాడి : సిపిఎం

తిరువనంతపురం : తిరువనంతపురంలోని ఎకెజి సెంటర్‌లో గల సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఒకడు కార్యాలయం సరిహద్దు గోడపై నాటు బాంబుతో దాడి చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో కేరళలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడికి కాంగ్రెస్‌ కారణమంటూ సిపిఎం విమర్శించింది. సంఘటన జరిగిన వెంటనే పెద్ద సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు కేరళవ్యాప్తంగా వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఎకెజి సెంటర్‌ వద్ద వందల సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ విజయన్‌, ఇందుకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోరారు. శాంతిని భగం చేసి, రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా ఈ దాడిని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో శాంతియుతంగా వ్యవహరించాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి వెనుక గల నీచపుటెత్తుగడలను గుర్తించి, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా జాగ్రత్తగా వుండాల్సిందిగా వామపక్ష ఉద్యమాన్ని ప్రేమించే వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశానికి హాజరయ్యారు. ఈ దాడిని రాష్ట్ర కార్యదర్శివర్గం కూడా తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా పిలుపునిచ్చింది.
''పెద్ద భవనం కూలితే ఎంత శబ్దం వస్తుందో అంతలా శబ్దం వినిపించింది.'' అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి పి.కె.శ్రీమతి తెలిపారు. దాడి జరిగిన సమయంలో కార్యాలయం లోపల వున్న ఆమె తర్వాత మీడియాతో మాట్లాడారు. టివిలో వార్తలు వింటున్నా, వెంటనే భయంకరమైన సౌండ్‌ వచ్చింది, దాంతో వణికిపోయాం, కిటికీలోంచి చూడగా, దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఎంట్రన్స్‌ దగ్గరే పేలుడు పదార్థం పేలిపోయింది, అందుకే ఆ ప్రయత్నం విఫలమైందని శ్రీమతి చెప్పారు.
ఎల్‌డిఎఫ్‌ ఖండన
వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) కన్వీనర్‌ ఇ.పి.జయరాజన్‌ దాడిని ఖండిస్తూ, రాష్ట్రంలో అరాచకత్వాన్ని సృష్టించేందుకే కాంగ్రెస్‌ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. సిపిఎం కార్యకర్తలు, కార్యాలయాలపై కాంగ్రెస్‌ వరుసగా జరుపుతున్న దాడుల్లో తాజా ఘటనే ఎకెజి సెంటర్‌పై దాడి అని అన్నారు. పార్టీ కార్యాలయం ఎదురుగా గల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు.
ముఖ్యమంత్రి విజయన్‌ విమానంలో ప్రయాణిస్తుండగా ఇద్దరు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఆరోగ్య మంత్రి వీణా జార్జిపై మెరుపుదాడి చేసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. వాయనాడ్‌లోని దేశాభిమాని పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిని సిపిఎం ఖండించిందని, దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్‌, యుడిఎఫ్‌ నేతలెవరూ ఖండించలేదని అన్నారు. కేరళను అల్లర్లు, ఘర్షణలతో దెబ్బతింటున్న రాష్ట్రంగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కన్నమ్‌ రాజేంద్రన్‌ విమర్శించారు.
కాంగ్రెస్‌ కూడా ఈ దాడిని ఖండించింది. ఈ దాడికి తమకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ప్రభుత్వాన్ని పీడిస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే సిపిఎం ఈ దాడి పథకాన్ని పన్నిందని కేరళ పిసిసి అధ్యక్షుడు కె.సుధాకరన్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురీంద్రన్‌ ఆరోపించారు.
పోలీసు దర్యాప్తు
ఇదిలా వుండగా, దాడిచేసిన వ్యక్తి గురించి పోలీసులు మరింత సమాచారం సేకరించారని అదనపు డైరెక్టర్‌ జనరల్‌ విజరు శేఖర్‌ మీడియాకు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు వివిధ గ్రూపులను మోహరించినట్లు తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామన్నారు. దాడి జరిగిన వెంటనే నేర నిపుణులు సంఘటనా స్థలానికి వచ్చి సాక్ష్యాధారాలను సేకరించారు. దాడి చేసిన నాటు బాంబులో ఎలాంటి పదునైన, ప్రాణాంతకమైన పదార్థాలు లేవని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాణాసంచాలో ఉపయోగించే తక్కువ స్థాయి పౌడర్‌ను ఉపయోగించి ఈ పేలుడు పదార్ధం తయారుచేసినట్లుగా కనిపిస్తోంది. ఈ నాటు బాంబు పెద్దగా శబ్దం చేస్తుంది కానీ ఎవరినీ తీవ్రంగా గాయపరచదని, కాలే గాయాలవుతాయని తెలిపారు.
డిజిటల్‌ వల
దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని క్లూస్‌ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారని నగర పోలీసు కమిషనర్‌ స్పర్జన్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిఘా కెమెరా ఫుటేజీని వారు విశ్లేషిస్తున్నారు. నేరం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని అన్ని ఫోన్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా సెల్‌ఫోన్‌ సర్వీసు ప్రొవైడర్లను కోరారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి అన్నీ బాగా ఆలోచించే దాడికి దిగినట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించారు. ఎకెజి సెంటర్‌ ఎదురుగా గల పోలీసు అధికారుల ఉనికి గురించి ఫార్వర్డ్‌ స్కౌట్‌ ఒకరు తెలియచేయడంతో దాడి చేసిన వ్యక్తి ఎలాంటి కాపలా లేని సెకండ్‌ గేట్‌ వద్ద దాడి చేశాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొలిట్‌బ్యూరో ఖండన
సిపిఎం కేరళ రాష్ట్ర కార్యాలయంపై దాడిని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా దర్యాప్తు జరిపి, దోషులను శిక్షించగలదని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. ఈ పిరికిపంద చర్యను ఖండించాల్సిందిగా అన్ని ప్రజాస్వామిక శక్తులను పొలిట్‌బ్యూరో కోరింది. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు తావివ్వకుండా శాంతియుతంగా నిరసన తెలియజేయాల్సిందిగా కోరింది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
దాడి జరిగిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సిపిఎం, విద్యార్ధి, యువజన, ఇతర వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. దాడి జరిగిన వెంటనే ఆ దాడిని ఖండిస్తూ నగరవ్యాప్తంగా అర్ధరాత్రి సమయంలో వందలాదిమంది ప్రదర్శన చేశారు. జిల్లా శాఖల ఆధ్వర్యంలో కూడా నిరసనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ ప్రదర్శనల్లో పాల్గన్నారు. సిఐటియు ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. పెద్ద సంఖ్యలో కార్మికులు కూడా నిరసనల్లో పాల్గన్నారు. ప్రాంతీయ కేంద్రాలతో సహా ప్రధాన రాష్ట్ర కేంద్రాల్లో మరిన్ని నిరసనలకై పార్టీ శాఖలు పిలుపునిచ్చాయి. దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
సిపిఎం కార్యాలయంపై బాంబు దాడిని ఖండించిన వామపక్షాలు
కేరళ సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యాలయం ఎకెజి భవన్‌పై జరిగిన బాంబుదాడిని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు వి శ్రీనివాసరావు (సిపిఎం), కె రామకృష్ణ (సిపిఐ), వై సాంబశివరావు (సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ), జాస్తి కిషోర్‌బాబు (సిపిఐ(ఎంఎల్‌)), కాటం నాగభూషణం (ఎంసిపిఐ(యు)), ఎన్‌ మూర్తి (సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌), పివి సుందరరామరాజు (ఫార్వర్డ్‌ బ్లాక్‌), జానకి రాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ బాంబు దాడికి కారకులైన వారిని కేరళ ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు ఈ చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు.