Mar 19,2023 17:45

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అందులోనే క్యూ న్యూస్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలో లేరు. దాడి అనంతరం సిబ్బంది, ఆయన అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.