
- ఆసుపత్రి పాలైన బాధితులు
ప్రజాశక్తి -భట్టిప్రోలు (బాపట్ల) : నది పరివాహక (ఆర్‌సి) భూముల కోసం పోరాడుతున్న దళితులపై కత్తులు, కర్రలతో పెత్తందారులకు దాడి చేశారు.ఈ దుశ్చర్య బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారథి వద్ద మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు.. కొల్లూరు మండలం చింతల్లంక, పెదలంక గ్రామాల దళితులు సొసైటీగా ఏర్పడి గత ఐదారేళ్లుగా కృష్ణా నదిలో మేటవేసిన భూములను పశువుల మేత కోసం, మరియు సాగు కోసం హక్కు కల్పించాలని అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను పలుమార్లు కోరారు. ఏ ఒక్కరూ స్పందించకపోవటంతో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో జనవరి ఏడో తేదీ నుంచి ఆ భూమిలోని పిచ్చిమొక్కలను తొలగించేందుకు పూనుకున్నారు. ఆ భూములను తామే ఆక్రమించుకోవాలనే ఆలోచనతోనో, లేక తమ భూముల పక్కనే దళితులు ఎందుకుండాలనే అభిప్రాయంతో పెసర్లంక, పెదలంక, గాజుల్లంక గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు సింగం కృష్ణప్రసాద్, సింగం శ్రీనివాసరావు, వెలివల బసవరత్తయ్య, ఉప్పు కృష్ణారావు, తోట బసవయ్య, కూరేటి శివయ్య, బావిరెడ్డి లోకనాథం, సగ్గున నగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వారి అనుచరులు దాదాపు 200 మంది దళితులపై దాడికి సోమవారం పథకం రచించారు. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం అరవింద వారథి వద్దకు చేరుకున్నారు. పెత్తందార్లను అదుపు చేయకుండా పోలీసులు చేతులెత్తేశారు. తహశీల్దార్‌కు విన్నవించుకోవాలని సూచించి చేతులు దులుపుకున్నారు. దీంతో వారు రెండు ట్రాక్టర్లు, బైకులపై మండల తహశీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. బైకుపై బయలుదేరిన నలుగురు యువకులను అరవింద వారధి వద్ద పెత్తందారులు అడ్డుకొని దాడి చేసి..హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడి విషయం తెలుసుకున్న దళితులు గొడవలు పడటం మంచిది కాదని భావించి బయలుదేరిన ట్రాక్టర్లు నిలిపివేసి.. గాయపడిన వారిని వైద్యశాలకు తరలించారు.
- ప్రజాసంఘాల ఖండన
దళితులపై కుల దూషణ, దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుసంఘం, కెవిపిఎస్ నాయకులు టి.కృష్ణమోహన్, టి.సురేష్, జి.సుధాకర్ ఖండించారు. ఘటనకు బాధ్యులైన అధికార పార్టీకి చెందిన పెత్తందారులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి.. దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.