
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కర్నూలు నగరంలో జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డ కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ కర్నూలుకు వచ్చిన నేపథ్యంలో వార్తా సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టులపై భౌతికదాడులకు పాల్పడటంతోపాటు ఫోన్‌లు, కెమెరాలను లాక్కోవడం తగదన్నారు. మోడీ, అమిత్ షా కనుసన్నల్లో సిబిఐ పనిచేస్తోందని అవినాష్‌రెడ్డి కేసులో మరోమారు రుజువైందన్నారు. జగన్, మోడీ, అమిత్ షా లాలూచి రాజకీయాలను రాష్ట్రంలోని ప్రజాతంత్ర వాదులంతా తీవ్రంగా ఖండించాలని కోరారు.