Sep 23,2022 08:00

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఏజెన్సీలో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ, రెవెన్యూ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సిఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇళ్లతోపాటు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని తెలిపారు. వాటి నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆప్షన్‌-3 ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతం చేస్తున్నామని అధికారులు వివరించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లలో వసతులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నామని తెలిపారు. అలాగే 2022-23లో ఇప్పటి వరకూ రూ.4,318 కోట్ల విలువైన పనులు చేశామని, తొలివిడతలో 15.6 లక్షలు, రెండో విడతలో 5.65 లక్షలు మొత్తం 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో పట్టాలు అందించే కార్యక్రమంపైనా సిఎం సమీక్ష చేశారు. ఇప్పటికే 98.8 వేలమందికి పట్టాలు ఇచ్చామని, మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పీడిక రాజన్నదొర, ఆదిమూలపు సురేష్‌, జోగి రమేష్‌, సిఎస్‌ సమీర్‌శర్మ, అధికారులు పాల్గొన్నారు.