May 18,2023 13:08

వియన్నా :   అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రియా ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. ద్రవ్యోల్బణం కారణంగా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుండి బలహీన వర్గాలకు సాయం అందించేందుకు 500 మిలియన్‌ యూరోలు (542 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ) నూతన ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. పిల్లలతో, ముఖ్యంగా ఒంటరి తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలను ద్రవ్యోల్బణం అసమానంగా ప్రభావితం చేస్తుందని బుధవారం నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆస్ట్రియా సామాజిక వ్యవహారాల మంత్రి జహన్నెస్‌ రౌచ్‌ పేర్కొన్నారు.

ఈ ప్యాకేజీ 2024 చివరి వరకు వరిస్తుందని అన్నారు. ఈ సహాయ ప్యాకేజీ ముఖ్యంగా పిల్లలతో ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని, నిరుద్యోగ భృతి, సామాజిక సాయం పొందుతున్న వారికి నెలవారీ ప్రాతిపదికన ఒక్కో చిన్నారికి 60 యూరోల అదనపు మొత్తం అందించబడుతుందని తెలిపారు. అలాగే నెలకు 2,000 యూరోల కన్నా తక్కువ సంపాదించే ఒంటరి తల్లిదండ్రులకు కూడా సమానంగా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం... ఆస్ట్రియా ద్రవ్యోల్బణం మార్చిలో 9.2 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 9.7 శాతానికి పెరిగింది. దీంతో ఆహారం, అద్దెలు, గృహ ఇంధనం వంటి వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.