
- ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : ఈ నెల 31 వరకు ఎపి వైఎస్ అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవద్దని సిబిఐని తెలంగాణ హైకోర్టు శనివారం ఆదేశించింది. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ ముందు సిబిఐ వాదనలు వినిపించింది. సిబిఐ తరుఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదించారు. అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. వివేకా హత్యకు నెల ముందే కుట్ర జరిగిందని, అవినాష్ నోరు విప్పితేనే దర్యాప్తు కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. అవినాష్ విచారణకు సహకరించడం లేదని, కేసు దర్యాప్తులో మొదటి నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. 'అవినాష్ కోరినట్టు విచారణ జరగదు. సిబిఐకి ప్రత్యేక విధానం ఉంటుంది. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెపుతున్నారు. ఈ కేసు విచారణలో ఎంతోమందిని విచారించాం. కొంతమందిని అరెస్ట్ చేశాం. అవినాష్‌రెడ్డికి ప్రత్యేక పరిస్థితి ఎందుకు? కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యం చేస్తున్నారు' అని హైకోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది. బుధవారం అవినాష్‌ను విచారణకు పిలుస్తామని తెలిపింది. ఈ సమయంలో కల్పించుకున్న జడ్జి సిబిఐపై ప్రశ్నలు గుప్పించారు. మిగతా నిందితులతో పోలిస్తే అవినాష్‌రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏమిటని, మిగతా నిందితులు విచారణకు సహకరిస్తున్నప్పుడు ఆయన ఎందుకు సహకరించడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక సామాన్యుడు నిందితుడు అయి ఉంటే ఇంత ఆలస్యంగా దర్యాప్తు ఉండేదా? అని న్యాయస్థానం సిబిఐని సూటిగా నిలదీసింది. రెండు రకాల నేరాలకు నిందితులు పాల్పడ్డారని, ఒకటి వివేక హత్య, రెండోది క్రైమ్ సీన్ డిస్ట్రక్షన్ అని సిబిఐ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఎన్నికల్లో వివేకా ఓడిపోవడం అంటే ఇది కచ్చితంగా కుట్రేనని సిబిఐ పేర్కొంది. వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని, ప్రధాన కారణం ఏంటని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని, వివేకా హత్య రాజకీయ కారణాలతోనే జరిగిందని సిబిఐ పేర్కొంది. అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని, ఎంఎల్‌సి ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగిందని తెలిపింది. ఎంపి అవినాష్‌రెడ్డి రాజకీయంగా శక్తిమంతుడైతే, వివేకాను చంపాల్సిన అవసరమేంటని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డి కుట్రను అమలు చేశారని కోర్టుకు సిబిఐ తెలిపింది. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి అవినాష్‌రెడ్డి వాట్సప్ కాల్స్ మాట్లాడారని, ఎవరితో మాట్లాడారో తెలియాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని సిబిఐని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 12న అవినాష్ ఫోన్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్ డేటా సేకరించామని, అవినాష్‌రెడ్డి సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని, కీలక సాక్షుల వాంగ్మూలాలు సీల్డ్ కవర్‌లో అందజేస్తామని కోర్టుకు సిబిఐ తెలిపింది. ప్రస్తుత దశలో సాక్ష్యాల వివరాలు వెల్లడించలేమని పేర్కొంది. అవినాష్ తరుఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, అవినాష్ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన అవసరం ఆమెకు ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాంగ్మూలాలపై అవినాష్ వాదనలు వినాల్సి ఉందని న్యాయమూర్తి అన్నారు. ఈ నెల 31 వరకు అవినాష్‌పై చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.