
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి రష్యాకు చెందిన 24వ సీడ్ విక్టోరియా అజరెంక, 22వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన రైబకినా ప్రవేశించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 33ఏళ్ల అజరెంక 6-4, 6-1తో 3వ సీడ్ జెస్సికా పెగులా(అమెరికా)పై, రైబకినా 6-2, 6-4తో 17వ సీడ్ ఓస్టాపెంకో(లాత్వియా)పై వరుససెట్లలో గెలిచారు. అజరెంకా ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అలాగే 2011, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ కూడాను. ఇక 25ఏళ్ల రైబకినా గత ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుపొందగా.. తొలిసారి ఆస్ట్రేలియన్ సెమీస్‌కు చేరింది. గురువారం జరిగే సెమీస్‌లో రైబకినా-అజరెంకాల మధ్య జరగనుంది.
- సిట్సిపాస్, ఖచనోవ్ కూడా...

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి 3వ సీడ్, గ్రీక్‌కు చెందిన స్టెఫోనస్ సిట్సిపాస్, 18వ సీడ్ ఖచనోవ్(రష్యా) ప్రవేశించారు. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ఫైనల్లో ఖచనోవ్ 7-6(7-5), 6-3, 3-0 ఆధిక్యతలో ఉండగా.. 29వ సీడ్ కొర్డా(అమెరికా) గాయంతో మ్యాచ్ మధ్యలో నిష్క్రమించాడు. దీంతో ఖచనోవ్కు వాకోవర్ లభించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు చేరాడు. మరో సెమీస్‌లో సిట్సిపాస్ 6-3, 7-6(7-2), 6-4తో అన్‌సీడెడ్ లెహెక్రా(చెక్)పై వరుససెట్లలో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
- సానియా-బొప్పన్న జోడీకి వాకోవర్..

మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బొప్పన్న జోడీకి వాకోవర్ లభించింది. మంగళవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ నుంచి వేగే(స్పెయిన)-ఓస్టాపెంకో(లాత్వియా) జోడీ నిష్క్రమించారు. దీంతో భారత జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీస్‌లో భారత జోడీ 3వ సీడ్ సుప్క్సీ(బ్రిటన్)-క్రాజిక్(అమెరికా)తో తలపడనున్నారు.