Aug 05,2022 19:57

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) :అమరావతిలో బిజెపి యాత్ర అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు అన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించకపోగా వారి నుంచి నిరసనలు ఎదుర్కొన్నారని, అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలేనని రాజధాని ప్రాంత ప్రజలు అంటున్నారని తెలిపారు. అమరావతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు శుక్రవారం మందడంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ... తమకు ఓటు వేస్తేనే అమరావతి అభివృద్ధి అని బిజెపి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వైసిపి తప్పులను ఢిల్లీలో లెక్కిస్తున్నామని, ఇంకా వంద తప్పులు పూర్తికాలేదని బిజెపి నాయకులు చెబుతున్నారని..బిజెపి, వైసిపి తప్పులను ప్రజలు వీధి వీధినా, లెక్కిస్తున్నారని, భవిష్యత్తులో వీరి లెక్కలు తేలుస్తారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడితేనే అమరావతికి, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజధాని అమరావతికి రూ.42 వేల కోట్లు అవసరమని బిజెపి నాయకులే చెప్పి, కేవలం రూ1500 కోట్లు ఇచ్చి సరిపెట్టారన్నారు. అమరావతిలో యాత్రలు కాదు..ఢిల్లీలో యాత్ర చేయండి...కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి.. చట్టబద్ధంగా రావాల్సిన నిధులు విడుదల చేయించండని బిజెపి నాయకులకు హితవు పలికారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, నాయకులు భాగ్యరాజు, శివాజీ, లక్ష్మణరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.