Nov 30,2022 07:17

ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో హిందూత్వ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2002 హింసాకాండ తర్వాత గుజరాత్‌ లోని ముస్లింలు చాలా అట్టడుగున ఉన్నారు. ఆ తర్వాత కూడా సంవత్సరాల తరబడి వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారన్న విషయాన్ని విస్మరించకూడదు. అయితే, ప్రజల్లో అసంతృప్తి మరోవిధంగా ముందుకు వస్తుందేమోనన్న బెంగ బిజెపిలో వుంది. అందుకే ఈ ఎన్నికల్లో తన హిందూత్వ పునాది చెదిరిపోకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నది.

గుజరాత్‌లో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించినప్పటికీ...నవంబర్‌ 10వ తేదీన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను న్యూఢిల్లీలో ప్రకటించినప్పుడు...రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోయారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం (వ్యాసం రాసే నాటికి), 182 మంది సభ్యులు గల శాసనసభకు ప్రకటించిన 160 మంది అభ్యర్థుల్లో 38 మంది కాంగ్రెస్‌ పార్టీని వీడి బిజెపి లో చేరిన వారే ఉన్నారు. అదే విధంగా 38 మంది సిట్టింగ్‌ శాసనసభ్యులకు టిక్కెట్లు ఇవ్వకుండా నిరాకరించారు. విజరు రూపానీ వంటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు కొందరు ఢిల్లీ లోని అధిష్టానం సలహా మేరకు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ నుంచి స్వచ్ఛందంగానే తప్పుకున్నారు.
           2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకునిగా ఉన్న విజరు రూపానీని తన మంత్రివర్గంతో సహా రాజీనామా సమర్పించాలని సెప్టెంబర్‌ 11న అధిష్టానం ఆదేశించి, ఆ స్థానాన్ని ఎవరూ ఊహించని రీతిలో భూపేంద్ర పటేల్‌కు కట్టబెట్టడంతో పాటు కొత్త వ్యక్తులను మంత్రివర్గం లోకి తీసుకున్నారు. ఈసారి గుజరాత్‌లో గెలుపు అంత తేలిక కాదనే విషయాన్ని బిజెపి అగ్రనేతలు పసిగట్టారు. ముఖ్యమంత్రిని, మంత్రివర్గ సభ్యుల్ని మార్చడం అనేది దీర్ఘకాలంగా బిజెపి వ్యూహంలో భాగంగా ఉంటూ వస్తున్నది. 2018లో బిజెపి మొదటిసారిగా ఉత్తర ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో విజయం సాధించింది. ఇప్పుడు అక్కడ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇటీవల కాలంలో అసాధారణ రీతిలో అక్కడి ముఖ్యమంత్రిని మార్చింది. ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు పాలనాపరమైన మార్పులను చేపడుతున్నది. ఎంతగా అంటే, కోవిడ్‌ మహమ్మారి నిర్వహణ, ఇతర సమస్యలపై విమర్శలను తగ్గించడానికి...ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా జులై 2021లో అనేక మంది సీనియర్లను, ప్రముఖులను తొలగించింది. అనేక రకాల ప్రక్షాళనలను చేపట్టింది.
         గుజరాత్‌లో 1996-98 మధ్య కాలంలో చీలిక నాయకుడైన శంకర్‌ సింగ్‌ వాఘేలా నాయకత్వంలోని పాలనా కాలాన్ని మినహాయిస్తే...1995 నుండి నిరంతరాయంగా బిజెపి పాలన సాగిస్తోంది. అలాంటి చోట ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందా పార్టీ. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులను మార్చడం ఆ పార్టీలో నెలకొన్ని భయాందోళనలకు సంకేతం.
మోడీ సందర్శనలు, వాగ్దానాలు
           మార్చి 2022 నుండి మొదలుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తన స్వరాష్ట్రాన్ని 12 దఫాలు సందర్శించారు. గత ఆరు నెలల్లోనే (జూన్‌ నుంచి) 10 సార్లు సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి, బిజెపి మళ్ళీ అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ సాధించిన మరుసటి రోజున మోడీ మొదటిసారి అంటే మార్చి 11, 12 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో, ఆ పక్కనున్న గాంధీనగర్‌లో రోడ్‌ షోలు నిర్వహించి... పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో గుజరాత్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల విజయంతో ప్రయోజనం పొందే స్పష్టమైన సూచిక ఇది.
          రోడ్‌ షోలు, బహిరంగ సభలు, సమావేశాలతో పాటుగా తన స్వంత రాష్ట్రానికి రూ. 1.18 లక్షల కోట్లతో ప్రాజెక్టులను నిర్మించ తలపెట్టినట్లు ప్రధాని అప్పటికే ప్రకటించారని మీడియా నివేదికల ఆధారిత అంచనా ఒకటి సూచిస్తున్నది. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. బిజెపి ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన ఆ విధమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆ వాగ్దానం పని చేస్తుందా లేదా అనేది అనిశ్చితం. ఎందుకంటే, అలాంటి ప్రకటనలు, ప్రారంభోత్సవ వేడుకలు చేసుకున్న బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బిజెపి గెలవలేదు కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో గెలిచింది.
           అయితే ఈ ప్రకటనల ప్రధాన లక్ష్యం, ప్రధానమంత్రికి ప్రజల్లో మంచి ప్రచారాన్ని సాధించడం. అయినా, బిజెపి కి ఓట్లు సంపాదించిపెట్టే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీనే. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, ''మీరు ఓటు వేయడానికి వెళ్లినపుడు, బిజెపి అభ్యర్థిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 'కమలం' గుర్తును మాత్రమే గుర్తుంచుకోండి. నేను మీ ముందుకు 'కమలం' గుర్తుతో వచ్చాను. మీరు 'కమలం' గుర్తును ఎక్కడ చూస్తే, అదే బిజెపి, మోడీ మీ దగ్గరకు వచ్చాడని అర్థం'' అని బహిరంగంగా ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న ఒక పార్టీకి చెందిన నాయకుడు, దేశానికి ప్రధాన మంత్రి, తాను తప్ప ఎవరిదీ ఏమీ లేదని ఓటర్లకు చెప్పాల్సి రావడం వింతగానూ, అసహజంగానూ, అసాధారణంగానూ ఉంది.
          డిసెంబర్‌ 5, 8 తేదీల్లో జరగనున్న ఎన్నికలకు వారం, పది రోజులకు ముందు కూడా (ఎన్నికల నిబంధనలు ఉన్న కారణంగా వివిధ ప్రాజెక్టుల ప్రకటనలు ఆగినప్పటికీ) మోడీ గుజరాత్‌లో మరికొన్ని ఎన్నికల ప్రచార పర్యటనల్లో పాల్గొంటారు.
 

                                                                                 హిందూత్వ కార్డు

బిజెపి హిందూత్వ పాలనా నమూనాను రూపొందించి, నిర్మించిన ఒక ప్రయోగశాల గుజరాత్‌. రాష్ట్రంలో ముస్లింలపై హింసాకాండ జరిగిన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఎన్నికలు సమీపించిన ప్రతిసారీ పాలక పార్టీ తన మతోన్మాద ఎత్తుగడలను ప్రయోగిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా 2002 బిల్కిస్‌ బానో కేసులో గ్యాంగ్‌ రేప్‌, హత్యలకు పాల్పడిన 11 మంది నేరస్థులను ఈ సంవత్సరం ఆగస్టు నెలలో సత్ప్రవర్తన గలవారనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వారు వాస్తవానికి జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నారు. కేంద్రం కూడా వారి విడుదలను అంగీకరించిందని తరువాత తెలిసింది. ఇలాంటి చర్యల పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, ఇవి హిందూత్వ భావాలను ముందుకు తీసుకు పోయేందుకు దోహదం చేస్తున్నట్టు కనపడుతుంది.
         తరువాత, రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని 'అమలు చేసేందుకు' ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకత్వంలోని హిందూత్వ మద్దతుదారులకు ఆసక్తికరమైన విషయం. ఇది మైనారిటీలను బోనులో పెట్టే నినాదంగా మారింది. ఇటీవల కాలంలో కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు అదే విధమైన ప్రకటనలు చేశాయి. పౌరసత్వ సవరణ చట్టం కింద గుజరాత్‌ లోని ఆనంద్‌, మెV్‌ాసానా జిల్లాల్లో పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని ఆ జిల్లాల కలెక్టర్లకు కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటన జారీ చేసింది. ఈ చట్టం ముస్లిమేతర మత విశ్వాసాలు గల వారికి పౌరసత్వాన్ని వేగంగా మంజూరు చేస్తుంది... కాబట్టి దేశ వ్యాప్తంగా ముస్లింల పట్ల వివక్షతతో కూడిన వ్యతిరేకతను ఇది వేగంగా కూడగట్టింది.
         ఈ బహిరంగ ప్రకటనలు ఏం సాధించాలనుకుంటున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో హిందూత్వ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2002 హింసాకాండ తర్వాత గుజరాత్‌ లోని ముస్లింలు చాలా అట్టడుగున ఉన్నారు. ఆ తర్వాత కూడా సంవత్సరాల తరబడి వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారన్న విషయాన్ని విస్మరించకూడదు. అయితే, ప్రజల్లో అసంతృప్తి మరోవిధంగా ముందుకు వస్తుందేమోనన్న బెంగ బిజెపిలో వుంది. అందుకే ఈ ఎన్నికల్లో తన హిందూత్వ పునాది చెదిరిపోకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నది.
 

                                                                            ప్రజల్లో అసంతృప్తి

''గుజరాత్‌ మోడల్‌'' విఫలమైందని రుజువు చేసే పరిణామాలు గడచిన ఐదేళ్లలో చోటుచేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో (2017) పటీదార్‌ ఆందోళన చాలా ఉధృతంగా నడుస్తున్నది. దీనికి నాయకత్వం వహించిన యువ నేత హార్దిక్‌ పటేల్‌ను ఆ తరువాత బిజెపి ప్రభుత్వం జైలులో పెట్టింది. జైలు నుండి విడుదలైన తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడాయన. కానీ చివరికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పంట పెట్టుబడి ఖర్చులు పెరిగి, పంటకు మద్దతు ధర పొందకుండా నష్టపోయిన రైతుల అసంతృప్తి వ్యక్తీకరణే ఈ పటీదార్‌ ఆందోళన. అక్కడ వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు అతి తక్కువ కనీస వేతనాలు పొందుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ... తక్కువ వేతనాలు, ఇబ్బందికర పని ప్రాంతాలు, ఉద్యోగ అభద్రత...పలు రకాల అపరిష్కృత సమస్యలతో పారిశ్రామిక కార్మికులు సతమతమవుతున్నారు.
            కోవిడ్‌ మహమ్మారిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. జనవరి 17, 2022 నాటికి కోవిడ్‌ కారణంగా 10,164 మంది మరణించారని గుజరాత్‌ అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ ఆ తరువాత (ఫిబ్రవరి 3, 2022 నాటికి) 1,02,203 దరఖాస్తులు అందాయనీ, అందుకుగాను 87,045 దరఖాస్తులను ఆమోదించి...82,605 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆరోగ్య సంరక్షణా విధానం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరులే కారణాలు. విజరు రూపానీని ముఖ్యమంత్రిగా తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన నిధుల లేమి ప్రజలను, ముఖ్యంగా అణగారిన వర్గాలను వెంటాడుతున్నది.
             దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కూడా తీవ్రమైన కష్టాలను, వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాలకు చెందిన ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్‌ అత్యంత ఎక్కువగా పట్టణీకరణ చెందిన రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌ జనాభాలో సుమారు 43 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలు అవినీతి, శిక్షల లేమితో పని చేస్తున్నాయనడానికి మోర్బీ వంతెన విషాదం ఒక సూచన. ప్రజలు రాష్ట్రం లోని పాలక పార్టీ పట్ల బాగా ఆగ్రహంతో ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న వివిధ స్రవంతులకు చెందిన ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ బిజెపి వర్గాల్లో భయానికి కారణభూతమైంది.

('న్యూస్‌ క్లిక్‌' సౌజన్యంతో)
సుబోధ్‌ వర్మ

సుబోధ్‌ వర్మ